సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో నెలకొన్న సమస్యలపై ఈనెల 18న జరగాల్సిన సమావేశాన్ని 22కు వాయిదా వేస్తూ కృష్ణా బోర్డు నిర్ణయించింది. 18న తెలుగు రాష్ట్రాల పరిధిలో పార్లమెంటరీ కమిటీ పర్యటిస్తున్న దృష్ట్యా, ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి సమీర్ ఛటర్జీ కొత్త సమావేశపు తేదీ, ఎజెండా అంశాలను పేర్కొంటూ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
ఈ సమావేశంలో తొలి విడత టెలీమెట్రీ పరికరాల అమరిక, 2017–18 వాటర్ ఇయర్ నీటి ప్రణాళిక, వర్కింగ్ మ్యాన్యువల్ ఆమోదం, నిధుల కేటాయింపుతోపాటు అత్యంత కీలకమైన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశాన్ని ఎజెండాలో చేర్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలంగాణ చేపట్టిన భక్తరామదాస, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ఎత్తిపోతల పథకాలను కొత్త ప్రాజెక్టులుగా చూపుతుండగా, ఏపీ చేపట్టిన శివభాస్యం సాగర్, మున్నేరు వంటి ప్రాజెక్టులు కొత్తవని తెలంగాణ అంటోంది. దీంతో పాటు పట్టిసీమ ద్వారా కృష్ణాబేసిన్‌కు తరలిస్తున్న నీటి వాటాల అంశాన్ని కృష్ణాబోర్డులో చర్చిద్దామని, ఇదివరకే గోదావరి బోర్డు సమావేశంలో నిర్ణయించారు.