
తేలుస్తారా.. నానుస్తారా..?
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి విడుదల అంశం ఎటూ తేలడం లేదు.
• రబీ నీటి విడుదలపై స్పష్టత ఇవ్వని కృష్ణా బోర్డు
• సాగర్ కింద 6.40 లక్షల ఎకరాల సాగుపై రైతుల్లో అయోమయం
• నేడు బోర్డు సభ్యకార్యదర్శితో భేటీ కావాలని రాష్ట్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి విడుదల అంశం ఎటూ తేలడం లేదు. ప్రాజెక్టుల వారీ అవసరాలను పేర్కొంటూ రాష్ట్రం నెల రోజుల కిందే ఇండెంట్ సమర్పించినా ఇంతవరకూ దీనిపై కృష్ణా బోర్డు ఏమీ తేల్చలేదు. వారం రోజులుగా సెలవులో ఉన్న బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ఛటర్జీ సోమవారం తిరిగి విధుల్లో చేరుతుండటంతో దీనిపై తేల్చుకునేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధమయ్యారు. ఇక్కడి అవసరాలపై రాష్ట్రం నెల రోజుల కిందటే బోర్డుకు లేఖ రాసింది. ఇందులో నాగార్జునసాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు 50 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ కింద 2.50 లక్షల ఎకరాలకు 15 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు తక్షణమే కేటారుుంచాలని కోరింది. దీంతో పాటే జూరాల కింద 20 టీఎంసీ, మీడియం ప్రాజెక్టులకు 8 టీఎంసీలు.. మొత్తంగా 103 టీఎంసీలు అవసరమని విన్నవించింది.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీలకు గానూ 155 టీఎంసీల లభ్యత ఉండగా, సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 162.35 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో వినియోగార్హమైన నీరు 190 టీఎంసీల మేర ఉన్నందున ఇందులోంచే రాష్ట్ర అవసరాలకు నీటిని ఇవ్వాలని కోరింది. కృష్ణా నీటిలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏపీ 187.18 టీఎంసీ నీటిని వాడుకోగా, తెలంగాణ 64.8 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంది. ఈ లెక్కన చూసినా రాష్ట్రం కోరిన మేర నీటిని విడుదల చేయాల్సి ఉంది. అరుుతే నీటి విడుదలపై ఏపీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఇప్పటికే జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం వారుుదా పడింది. గత వారం నిర్వహించాలని భావించినా బోర్డు సభ్య కార్యదర్శిసమీర్ ఛటర్జీ సెలవులో ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో సాగర్ కింద రబీ సాగుకు నీటి విడుదలపై స్పష్టత లేక ఆయకట్టు రైతుల్లో అయోమయం నెలకొంది. సోమవారం నిర్వహించే భేటీ సఫలమైతే నీటి విడుదలపై స్పష్టత రానుంది.