‘మైనర్’ వినియోగం 16 టీఎంసీలే?
• కృష్ణా బేసిన్‌లో మైనర్ ఇరిగేషన్
• వినియోగంపై లెక్క తేల్చిన రాష్ట్రం
• ఏపీ వాడకం 22 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో చిన్న నీటి వనరులు (మైనర్ ఇరిగేన్) కింద ప్రస్తుత ఏడాదిలో 16 టీఎంసీలు వినియోగించినట్లు నీటి పారుదల శాఖ తేల్చినట్లుగా సమాచారం. ఇవే లెక్కలను రాష్ర్ట ప్రభుత్వం కృష్ణా బోర్డు నియమించిన త్రిసభ్య కమిటీ ముందు పెట్టే అవకాశాలున్నాయి. కృష్ణా బేసిన్‌లో మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన నీటి వాటాలన్నింటినీ తెలంగాణ వినియోగిస్తోందని, ఆ లెక్కలను తేల్చాలని ఏపీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
దీంతో మైనర్ లెక్కలను తేల్చేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నేప థ్యంలో రాష్ట్రం.. మొత్తం లెక్కలను తీసింది. నిజానికి కృష్ణాలో తెలంగాణకు 299 టీఎం సీలు, ఏపీకి 512 టీఎంసీలు ఉండగా, మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులోనూ వంద ఎకరాలకు పైగా ఉన్న చెరువులు బేసిన్ పరిధిలోని 5 జిల్లాలో కేవలం 2,009 ఉన్నాయి.
వీటికింద 4.78 లక్షల మేర ఆయకట్టులో వినియోగించుకునే నీటి సామర్థ్యం 63.78 టీఎంసీలున్నా, వినియోగం 16 టీఎంసీలు దాటలేదని నీటిపారుదల శాఖ వర్గాలు తేల్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా లో 16 టీఎంసీలకు 2 టీఎంసీలకు మించి వినియోగంలో లేదని, నల్లగొండ జిల్లాలో నూ 14.8 టీఎంసీల వాటాలో 3 టీఎంసీలకు మించి వాడలేదని రాష్ట్రం చెప్పినట్టు సమాచారం. గత రెండేళ్లలో మాత్రం బేసిన్‌లో ఏర్పడ్డ గడ్డు పరిస్థితుల వల్ల మైనర్ కింద చుక్క నీరూ వినియోగించలేదని చెప్పినట్లు తెలిసింది. ఏపీ తన వాటా పూర్తిగా వినియోగించుకున్నట్లు తెలిపినట్టు సమాచారం.