Minor irrigation
-
మైనర్ ఇరిగేషన్లో 5వ స్థానంలో రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: చిన్న నీటిపారుదల వనరుల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. భూగర్భ వనరుల్లో 5వ స్థానం, భూ ఉపరితల వనరుల్లో 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 16,79,868 చిన్న నీటిపారుదల వనరులుండగా, అందులో 16,79,868 (94%) భూగర్భ జల వనరులు, 1,00,619 (6%) భూ ఉపరితల జల వనరులున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించిన చిన్న నీటిపారుదల వనరుల 6వ గణన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2017–18కి సంబంధించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఐదో గణనతో పోలిస్తే 6వ గణన నాటికి రాష్ట్రంలో 15,22,292 (10.4%) వనరులు పెరిగాయి. దేశంలోని మొత్తం చిన్న నీటిపారుదల వనరుల్లో రాష్ట్రం వాటా 7.3 శాతంగా ఉంది. 95 శాతం ప్రైవేటు యాజమాన్యంలోనే.. చిన్న నీటిపారుదల వనరుల్లో 16,09,623 (95.8 శాతం) ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో ఉండగా, 56,668 (3.4 శాతం) ప్రభుత్వం, 13,577 (0.8 శాతం) రైతు గ్రూపుల యాజమాన్యంలో ఉన్నాయి. 1,00,619 భూ ఉపరితల వనరుల్లో 52,703 (52.4% ) ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఐదెకరాలు, అంతకంటే తక్కువ పొలాలు కలిగిన చిన్న కమతాల రైతుల యాజమాన్యంలోనే 13,36,767 (83.1%) వ్యక్తిగత చిన్న నీటిపారుదల వనరులున్నాయి. మిగిలిన 16.9 శాతం వనరులు పెద్ద, మధ్యతరహా రైతుల యాజమాన్యంలో ఉన్నాయి. 81% సబ్ మెర్సిబుల్ పంపులే.. 16,79,868 చిన్న నీటిపారుదల వనరుల్లో 15,96,852 వనరుల నుంచి నీళ్లను తోడడానికి మోటార్లను వినియోగిస్తున్నారు. అందులో 13,03,446 (81.6%) సబ్ మెర్సిబుల్ పంపులు, 2,60,626 (16.3%) సాధారణ పంపు మోటార్లను వినియోగిస్తున్నారు. 893 (0.1శాతం) వనరుల నుంచి మనుషులు, జంతువుల సహాయంతో నీళ్లను తోడుతున్నారు. 41.6 శాతం భూగర్భ పైప్‌లైన్ ఆధారిత వనరులు.. చిన్న నీటిపారుదల వనరుల్లో 6,75,008 (41.6%) వనరులు భూగర్భ పైప్‌లైన్ ద్వారా, 3,98,977 (24.6%) వనరులు లైనింగ్ లేని కాల్వల ద్వారా, 2,32,821 (14.4%) వనరులు భూ ఉపరితల పైపుల ద్వారా, లైన్డ్ కాల్వల ద్వారా 2,30,859 ( 14.2%) వనరులు, 42,858 (2.6%) వనరులు డ్రిప్, 31,523 (1.9%) వనరులు స్ప్రింకర్ల ద్వారా, మిగిలిన 9,045 (0.7%) వనరులు ఇతర పరికరాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాయి. 96.5% వనరులు వినియోగంలో.. మొత్తం 16,79,868 వనరుల్లో 16,21,091 (96.5%) శాతం వినియోగంలో ఉండగా, 35,798 ( 2.1%) తాత్కాలికంగా, 22,979 (1.4%) వనరులు శాశ్వతంగా వినియోగంలో లేవు. 16.3% పెరిగిన సామర్థ్యం.. రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వనరుల అభివృద్ధితో 16.3 శాతం సాగునీటి సామర్థ్యం పెరిగింది. 5వ గ ణన నాటికి 30,14,446 హెక్టార్లు ఉన్న ఆయకట్టు 6 వ గణనలో 35,06,333 హెక్లార్లకు పెరిగింది. 5వ గణన నాటికి 22,06,925 హెక్టార్ల ఆయకట్టు విని యోగంలో ఉండగా, 6వ గణనలో వినియోగం 28, 88,483 (30.9 శాతం వృద్ధి) హెక్టార్లకు పెరిగింది. -
తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ గొప్పవరం
-
‘మైనర్’ వినియోగం 16 టీఎంసీలే?
• కృష్ణా బేసిన్లో మైనర్ ఇరిగేషన్ • వినియోగంపై లెక్క తేల్చిన రాష్ట్రం • ఏపీ వాడకం 22 టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో చిన్న నీటి వనరులు (మైనర్ ఇరిగేన్) కింద ప్రస్తుత ఏడాదిలో 16 టీఎంసీలు వినియోగించినట్లు నీటి పారుదల శాఖ తేల్చినట్లుగా సమాచారం. ఇవే లెక్కలను రాష్ర్ట ప్రభుత్వం కృష్ణా బోర్డు నియమించిన త్రిసభ్య కమిటీ ముందు పెట్టే అవకాశాలున్నాయి. కృష్ణా బేసిన్లో మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన నీటి వాటాలన్నింటినీ తెలంగాణ వినియోగిస్తోందని, ఆ లెక్కలను తేల్చాలని ఏపీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీంతో మైనర్ లెక్కలను తేల్చేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నేప థ్యంలో రాష్ట్రం.. మొత్తం లెక్కలను తీసింది. నిజానికి కృష్ణాలో తెలంగాణకు 299 టీఎం సీలు, ఏపీకి 512 టీఎంసీలు ఉండగా, మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులోనూ వంద ఎకరాలకు పైగా ఉన్న చెరువులు బేసిన్ పరిధిలోని 5 జిల్లాలో కేవలం 2,009 ఉన్నాయి. వీటికింద 4.78 లక్షల మేర ఆయకట్టులో వినియోగించుకునే నీటి సామర్థ్యం 63.78 టీఎంసీలున్నా, వినియోగం 16 టీఎంసీలు దాటలేదని నీటిపారుదల శాఖ వర్గాలు తేల్చాయి. మహబూబ్‌నగర్ జిల్లా లో 16 టీఎంసీలకు 2 టీఎంసీలకు మించి వినియోగంలో లేదని, నల్లగొండ జిల్లాలో నూ 14.8 టీఎంసీల వాటాలో 3 టీఎంసీలకు మించి వాడలేదని రాష్ట్రం చెప్పినట్టు సమాచారం. గత రెండేళ్లలో మాత్రం బేసిన్లో ఏర్పడ్డ గడ్డు పరిస్థితుల వల్ల మైనర్ కింద చుక్క నీరూ వినియోగించలేదని చెప్పినట్లు తెలిసింది. ఏపీ తన వాటా పూర్తిగా వినియోగించుకున్నట్లు తెలిపినట్టు సమాచారం. -
‘మైనర్’కూ అదనపు చెల్లింపు?
* జీవో 146ను అమలు చేయాలని ప్రభుత్వానికి * ఇరిగేషన్ కాంట్రాక్టర్ల విన్నపం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేస్తున్న విధానాన్నే చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టు(మైనర్ ఇరిగేషన్) పనులకూ వర్తింప జేయాలన్న డిమాండ్ వస్తోంది. ఈ విధానాన్ని తమకూ వర్తింప జేయాలని కోరుతూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించుకుంది. దీనిపై పరిశీలన చేసి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం... రాష్ట్ర నీటి పారుదల శాఖకు సూచించింది. రాష్ట్రంలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో-146ను 25 రోజుల కిందట జారీ చేసింది. ఇదే విధానం ఇప్పుడు మైనర్ ఇరిగేషన్‌కు వర్తింప జేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. -
చిన్ననీటి పారుదలకు రూ.100 కోట్లు
వరంగల్ : చిన్న నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య చెప్పారు. హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా రెండున్నర లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సర్కార్ తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేస్తోందని, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకుసాగుతోందన్నారు. ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేందుకు ‘మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో అన్ని వర్గాలను భాగస్వామ్యములను చేస్తున్నట్లు పేర్కొన్నా రు. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందని, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతరంగా అఖిలపక్షం ఇందులో పాల్గొనాలని సూచిం చారు. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిం దని, దళితులకు రూ.50వేల కోట్లు, బీసీలకు రూ.25వేల కోట్లు, మైనార్టీలకు రూ.10వేల కోట్లు, గిరిజనలకు రూ.15వేల కోట్లు కేటాయించినట్లు తెలి పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడు తూ ‘మన ఊరు-మన ప్రణాళిక’ అమలుకు కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ మహత్తరమైన ‘మన ప్రణాళిక’లో ప్రజలంతా భాగస్వాములై రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ సమాజంలో 85 శాతంగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దళిత, గిరిజన కుటుంబాలకు అండగా కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ సహోదర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు, పార్టీ నాయకులు మరుపల్ల రవి, లలితాయాదవ్, సంపత్, రాజేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతర పనులు ముమ్మరం
మేడారం (తాడ్వాయి), న్యూస్‌లైన్ : మేడారంలో ఫిబ్రవరిలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జాతర పనుల కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు కేటాయించింది. గిరిజన సం క్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మినహా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో జంపన్నవాగుపై అదనం గా రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో రూ.9కోట్లతో కొత్తూరు సమీపంలో జంపన్నవాగుపై 300 మీటర్ల వరకు స్నానఘట్టాల నిర్మాణం జరుగుతోంది. భూమి చదును పనులు పూర్తి చేసి మెట్ల కోసం సెంట్రింగ్ చేపట్టారు. జాతరను అధికారులు పర్యవేక్షిం చేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో జంపన్నవాగు, ఊరట్టం జంపన్నవాగు, కొత్తూరు కాజ్వే, ఆర్టీసీ బస్టాండ్, గద్దెల ప్రాంతంలో చేపట్టిన మంచెల నిర్మాణం కొనసాగుతోంది. ఆర్అండ్బీ, పీఆర్ ఆధ్వర్యంలో బయ్యక్కపేట, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక, జంపన్నవాగు నుంచి గద్దెల వరకు రోడ్ల విస్తీర్ణం పనులు జరుగుతున్నాయి. ఈనెల 18న మేడారంలో జేసీ పౌసుమిబసు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర అభివృద్ధి పనుల వేగం పెంచాలని, వారంలో ఎంత పనిచేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను అదేశించడం గమనార్హం. హుండీలకు మరమ్మతులు మేడారంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీలకు మరమ్మతులు చేస్తున్నారు. జాతర సమీపిస్తున్నందున భక్తుల రాక పెరుగుతోంది. వారు కానుకలు వేసేందుకు జాతరకు ముందుగానే అమ్మవార్ల గద్దెలపై హుండీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. -
చెరువులకు మరమ్మతులేవీ?
సాక్షి, నెల్లూరు: ఒకప్పుడు చెరువు కింద సేద్యముంటే ఆ రైతు పంట పండినట్టే లెక్క. రానురాను పరిస్థితులు మారిపోతున్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరితో చెరువులు రూపుకోల్పోతున్నాయి. పుష్కలంగా నిధులున్నా చెరువుల ఆధునికీకరణపై దృష్టిపెట్టే వారు కరువయ్యారు. రికార్డుల్లో మాత్రం మరమ్మతులకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు నమోదవుతోంది. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. క్రమేణా చెరువు కింద సేద్యమంటేనే అన్నదాత భయపడే పరిస్థితి నెలకొంది. రబీసీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని చెరువుల దుస్థితిపై నిర్వహించిన ‘ఫోకస్’లో ఈ అంశాలు వెలుగుజూశాయి. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 732, పంచాయతీరాజ్ పరిధిలో 984, మేజర్ ఇరిగేషన్ పరిధిలో 66 చెరువులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ పరిధిలో కనుపూరు కెనాల్ కింద 85, స్వర్ణముఖి బ్యారేజీ కింద 10 చెరువులు ఉన్నాయి. మొత్తం 1,877 చెరువుల పరిధిలో 4,04,202 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏడాదిలో జిల్లాలో సగటున నమోదుకావాల్సిన వర్షపాతం 1080 మిల్లీమీటర్లు. అక్టోబర్ చివరినాటికే 653 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా ఇప్పటివరకు 632.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ క్రమంలో చెరువుల్లో ఓ మోస్తరు నీరు చేరింది. చెరువులు ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో అరకొర నీరు చేరినా ఉపయోగం లేకుండా పోతోంది. దుస్థితిలో చెరువులు గతంలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చిన సమయంలో జిల్లాలోని పలు చెరువుల కట్టలు, తూములు దెబ్బతిన్నాయి. వాటికి శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. బోగోలు చెరువుకట్ట తెగిపోయి చాలాకాలమైనా తాత్కాలిక రింగ్బండ్తోనే సరిపెట్టారు. రూ.85 లక్షల అంచనాలతో టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి, ఓ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయినా ఇప్పటివరకు పనులు మొదలుకాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు దొరవారిసత్రం, గంగపట్నం, సీతారామపురం మండలం పడమర్లవారి చెరువు, ఓరుగుండ్లపల్లి, ఊచగుంటపాళెం చెరువులకు గండ్లుపడ్డాయి. ఓజిలి చెరువుకట్ట దెబ్బతింది. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సివున్నా మన పాలకులు, అధికారులకు పట్టడం లేదు. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ చెరువులో మట్టిని స్థానికులు అక్రమంగా త వ్వుకుపోవడంతో లోపలంతా అస్తవ్యస్తంగా తయారైంది. రాపూరు, సైదాపురం చెరువుల్లో వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇలా చెప్పుకుంటే పోతే జిల్లాలోని దాదాపు అన్ని చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉంది. కోట్లలో లెక్కలు ఓ వైపు చెరువులన్నీ అధ్వానస్థితిలో ఉండగా ఏటా కోట్లాది రూపాయలతో ఆధునికీకరణ పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు రూ.49 కోట్లు వెచ్చించి 566 చెరువులను ఆధునికీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.23 కోట్లతో 355 చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు పేర్కొంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరో 374 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ కోట్లాది రూపాయలు ఎక్కడకు పోతున్నాయో ఏమో గానీ జిల్లాలో మెజారిటీ చెరువులు అధ్వానంగా ఉండటంతో సేద్యం అన్నదాతకు ఓ అగ్నిపరీక్షలా మారింది. పనులు జరుగుతున్నాయి: కోటేశ్వరరావు, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టిన పనులు ఆలస్యమవుతున్నాయి. మిగిలిన పనులు మాత్రం జరుగుతున్నాయి. త్వరలోనే అన్నిచెరువులు, కాలువల ఆధునికీకరణ పూర్తి చేస్తాం. -
గుండె చెరువే
సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా వర్షాలు కురిసే అక్టోబరు నెలలో కూడా ఆశించిన మేర వర్షం కురవలేదు. నవంబరు నెలలో అయితే చినుకు జాడలేదు. మొత్తంగా పరిశీలించినా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షం పాతం 1,080 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 632.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 95 శాతం చెరువులకు నామమాత్రంగా కూడా నీరు చేరని పరిస్థితి నెలకొంది. జిల్లా మొత్తంగా 1,877 చెరువుల పరిధిలో 4,04,202 ఎకరాలు ఆయకట్టు సాగవుతోంది. ఇందులో మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి 732 చెరువులు ఉండగా వీటి పరిధిలో 2,37,658 ఎకరాలు ఆయకట్టు ఉంది. పంచాయతీరాజ్ పరిధిలో 984 చెరువులు ఉండగా వీటి పరిధిలో 36,358 ఎకరాలు, మేజర్ ఇరిగేషన్ కింద (పెన్నార్ డెల్టా) 66 చెరువుల పరిధిలో 1,02,964 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద కనుపూరు కాలువ పరిధిలో 85 చెరువుల కింద 18 వేల ఎకరాలు, స్వర్ణముఖి బ్యారేజ్ కింద 10 చెరువుల పరిధిలో 9,022 ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ ఏడాది అడపాదడపా వర్షాలు కురిసినా చెరువులకు నామమాత్రంగా కూడా నీళ్లు చేరలేదు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో వందలాది చెరువులు చుక్కనీరులేక బీళ్లను తలపిస్తున్నాయి. మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని 1,716 చెరువులు ఉంటే 1,668 చెరువులకు అరకొరగా నీరు చేరాయి. వీటిలో 34 చెరువులకు 25 శాతం నీళ్లు చేరగా 11 చెరువులు 50 శాతం, మూడు చెరువులు 75 శాతం నిండినట్లు అధికారులు చెబుతున్నారు. మేజర్ ఇరిగేషన్ పరిధిలోని 66 చెరువులకు గాను 36 చెరువులకు చుక్క నీరు రాలేదు. 6 చెరువులు 25 శాతం, 13 చెరువులు 50 శాతం, 11 చెరువులు 70 శాతం నిండాయి. మీడియం ఇరిగేషన్ పరిధిలోని కనుపూరు కాలువ కింద 85 చెరువులు ఉండగా 25 శాతం చెరువులకు నామమాత్రంగా కూడా నీరు చేరక పోగా, 60 చెరువులు 20 శాతం నీరు కూడా చేరలేదు. స్వర్ణముఖి బ్యారేజ్ పరిధిలోని 10 ట్యాంకులు మాత్రం 50 శాతం నిండాయి. పెన్నార్ డెల్టా పరిధిలో సోమశిల నీటి వల్లే ఆ కొన్ని చెరువులకైనా నీరు చేరినట్లు తెలుస్తోంది. మెట్ట ప్రాంతాల్లోని చెరువులతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని చాలా చెరువులకు చుక్క నీరు చేరలేదు. ఇందుకూరుపేట, టీపీ గూడూరు, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, వెంకటాచలం, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, మనుబోలు, పొదలకూరు, దగదర్తి, వాకాడు, బోగోలు, జలదంకి, కొండాపురం, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి, మర్రిపాడుతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ చెరువులకు నామమాత్రంగా కూడా నీరు చేరలేదు. దీంతో పెన్నార్ డెల్టా పరిధిలోని చెరువుల కింద లక్ష ఎకరాల పోను మిగిలిన చెరువుల పరిధిలో ఉన్న మూడు లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారనుంది. జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలు పడటం సాధారణం. అయితే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 46 మండలాల పరిధిలోని 22 మండలాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదైంది. అరకొరగా కురిసిన వర్షాలతో రైతులు ప్రత్యామ్నాయంగా కంది, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.