సాక్షి, నెల్లూరు: ఒకప్పుడు చెరువు కింద సేద్యముంటే ఆ రైతు పంట పండినట్టే లెక్క. రానురాను పరిస్థితులు మారిపోతున్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్య వైఖరితో చెరువులు రూపుకోల్పోతున్నాయి. పుష్కలంగా నిధులున్నా చెరువుల ఆధునికీకరణపై దృష్టిపెట్టే వారు కరువయ్యారు. రికార్డుల్లో మాత్రం మరమ్మతులకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు నమోదవుతోంది. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. క్రమేణా చెరువు కింద సేద్యమంటేనే అన్నదాత భయపడే పరిస్థితి నెలకొంది.
రబీసీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని చెరువుల దుస్థితిపై నిర్వహించిన ‘ఫోకస్’లో ఈ అంశాలు వెలుగుజూశాయి. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 732, పంచాయతీరాజ్ పరిధిలో 984, మేజర్ ఇరిగేషన్ పరిధిలో 66 చెరువులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ పరిధిలో కనుపూరు కెనాల్ కింద 85, స్వర్ణముఖి బ్యారేజీ కింద 10 చెరువులు ఉన్నాయి. మొత్తం 1,877 చెరువుల పరిధిలో 4,04,202 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏడాదిలో జిల్లాలో సగటున నమోదుకావాల్సిన వర్షపాతం 1080 మిల్లీమీటర్లు. అక్టోబర్ చివరినాటికే 653 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా ఇప్పటివరకు 632.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ క్రమంలో చెరువుల్లో ఓ మోస్తరు నీరు చేరింది. చెరువులు ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో అరకొర నీరు చేరినా ఉపయోగం లేకుండా పోతోంది.
దుస్థితిలో చెరువులు
గతంలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చిన సమయంలో జిల్లాలోని పలు చెరువుల కట్టలు, తూములు దెబ్బతిన్నాయి. వాటికి శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. బోగోలు చెరువుకట్ట తెగిపోయి చాలాకాలమైనా తాత్కాలిక రింగ్‌బండ్‌తోనే సరిపెట్టారు. రూ.85 లక్షల అంచనాలతో టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి, ఓ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయినా ఇప్పటివరకు పనులు మొదలుకాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు దొరవారిసత్రం, గంగపట్నం, సీతారామపురం మండలం పడమర్లవారి చెరువు, ఓరుగుండ్లపల్లి, ఊచగుంటపాళెం చెరువులకు గండ్లుపడ్డాయి. ఓజిలి చెరువుకట్ట దెబ్బతింది. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సివున్నా మన పాలకులు, అధికారులకు పట్టడం లేదు. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ చెరువులో మట్టిని స్థానికులు అక్రమంగా త వ్వుకుపోవడంతో లోపలంతా అస్తవ్యస్తంగా తయారైంది. రాపూరు, సైదాపురం చెరువుల్లో వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇలా చెప్పుకుంటే పోతే జిల్లాలోని దాదాపు అన్ని చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉంది.
కోట్లలో లెక్కలు
ఓ వైపు చెరువులన్నీ అధ్వానస్థితిలో ఉండగా ఏటా కోట్లాది రూపాయలతో ఆధునికీకరణ పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సుమారు రూ.49 కోట్లు వెచ్చించి 566 చెరువులను ఆధునికీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.23 కోట్లతో 355 చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు పేర్కొంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరో 374 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ కోట్లాది రూపాయలు ఎక్కడకు పోతున్నాయో ఏమో గానీ జిల్లాలో మెజారిటీ చెరువులు అధ్వానంగా ఉండటంతో సేద్యం అన్నదాతకు ఓ అగ్నిపరీక్షలా మారింది.
పనులు జరుగుతున్నాయి: కోటేశ్వరరావు, ఎస్‌ఈ, ఇరిగేషన్ శాఖ
టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టిన పనులు ఆలస్యమవుతున్నాయి. మిగిలిన పనులు మాత్రం జరుగుతున్నాయి. త్వరలోనే అన్నిచెరువులు, కాలువల ఆధునికీకరణ పూర్తి చేస్తాం.
చెరువులకు మరమ్మతులేవీ?
Published Wed, Nov 20 2013 3:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement