సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా వర్షాలు కురిసే అక్టోబరు నెలలో కూడా ఆశించిన మేర వర్షం కురవలేదు. నవంబరు నెలలో అయితే చినుకు జాడలేదు. మొత్తంగా పరిశీలించినా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షం పాతం 1,080 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 632.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 95 శాతం చెరువులకు నామమాత్రంగా కూడా నీరు చేరని పరిస్థితి నెలకొంది. జిల్లా మొత్తంగా 1,877 చెరువుల పరిధిలో 4,04,202 ఎకరాలు ఆయకట్టు సాగవుతోంది. ఇందులో
మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి 732 చెరువులు ఉండగా వీటి పరిధిలో 2,37,658 ఎకరాలు ఆయకట్టు ఉంది. పంచాయతీరాజ్ పరిధిలో 984 చెరువులు ఉండగా వీటి పరిధిలో 36,358 ఎకరాలు, మేజర్ ఇరిగేషన్ కింద (పెన్నార్ డెల్టా) 66 చెరువుల పరిధిలో 1,02,964 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద కనుపూరు కాలువ పరిధిలో 85 చెరువుల కింద 18 వేల ఎకరాలు, స్వర్ణముఖి బ్యారేజ్ కింద 10 చెరువుల పరిధిలో 9,022 ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ ఏడాది అడపాదడపా వర్షాలు కురిసినా చెరువులకు నామమాత్రంగా కూడా నీళ్లు చేరలేదు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో వందలాది చెరువులు చుక్కనీరులేక బీళ్లను తలపిస్తున్నాయి.
మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని 1,716 చెరువులు ఉంటే 1,668 చెరువులకు అరకొరగా నీరు చేరాయి. వీటిలో 34 చెరువులకు 25 శాతం నీళ్లు చేరగా 11 చెరువులు 50 శాతం, మూడు చెరువులు 75 శాతం నిండినట్లు అధికారులు చెబుతున్నారు. మేజర్ ఇరిగేషన్ పరిధిలోని 66 చెరువులకు గాను 36 చెరువులకు చుక్క నీరు రాలేదు. 6 చెరువులు 25 శాతం, 13 చెరువులు 50 శాతం, 11 చెరువులు 70 శాతం నిండాయి. మీడియం ఇరిగేషన్ పరిధిలోని కనుపూరు కాలువ కింద 85 చెరువులు ఉండగా 25 శాతం చెరువులకు నామమాత్రంగా కూడా నీరు చేరక పోగా, 60 చెరువులు 20 శాతం నీరు కూడా చేరలేదు. స్వర్ణముఖి బ్యారేజ్ పరిధిలోని 10 ట్యాంకులు మాత్రం 50 శాతం నిండాయి. పెన్నార్ డెల్టా పరిధిలో సోమశిల నీటి వల్లే ఆ కొన్ని చెరువులకైనా నీరు చేరినట్లు తెలుస్తోంది.
మెట్ట ప్రాంతాల్లోని చెరువులతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని చాలా చెరువులకు చుక్క నీరు చేరలేదు. ఇందుకూరుపేట, టీపీ గూడూరు, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, వెంకటాచలం, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, మనుబోలు, పొదలకూరు, దగదర్తి, వాకాడు, బోగోలు, జలదంకి, కొండాపురం, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి, మర్రిపాడుతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ చెరువులకు నామమాత్రంగా కూడా నీరు చేరలేదు.
దీంతో పెన్నార్ డెల్టా పరిధిలోని చెరువుల కింద లక్ష ఎకరాల పోను మిగిలిన చెరువుల పరిధిలో ఉన్న మూడు లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారనుంది. జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో భారీ వర్షాలు పడటం సాధారణం. అయితే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 46 మండలాల పరిధిలోని 22 మండలాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదైంది. అరకొరగా కురిసిన వర్షాలతో రైతులు ప్రత్యామ్నాయంగా కంది, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గుండె చెరువే
Published Thu, Nov 14 2013 4:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement