సాక్షి, హైదరాబాద్: చిన్న నీటిపారుదల వనరుల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. భూగర్భ వనరుల్లో 5వ స్థానం, భూ ఉపరితల వనరుల్లో 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 16,79,868 చిన్న నీటిపారుదల వనరులుండగా, అందులో 16,79,868 (94%) భూగర్భ జల వనరులు, 1,00,619 (6%) భూ ఉపరితల జల వనరులున్నాయి.
కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించిన చిన్న నీటిపారుదల వనరుల 6వ గణన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2017–18కి సంబంధించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఐదో గణనతో పోలిస్తే 6వ గణన నాటికి రాష్ట్రంలో 15,22,292 (10.4%) వనరులు పెరిగాయి. దేశంలోని మొత్తం చిన్న నీటిపారుదల వనరుల్లో రాష్ట్రం వాటా 7.3 శాతంగా ఉంది.
95 శాతం ప్రైవేటు యాజమాన్యంలోనే..
చిన్న నీటిపారుదల వనరుల్లో 16,09,623 (95.8 శాతం) ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో ఉండగా, 56,668 (3.4 శాతం) ప్రభుత్వం, 13,577 (0.8 శాతం) రైతు గ్రూపుల యాజమాన్యంలో ఉన్నాయి. 1,00,619 భూ ఉపరితల వనరుల్లో 52,703 (52.4% ) ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఐదెకరాలు, అంతకంటే తక్కువ పొలాలు కలిగిన చిన్న కమతాల రైతుల యాజమాన్యంలోనే 13,36,767 (83.1%) వ్యక్తిగత చిన్న నీటిపారుదల వనరులున్నాయి. మిగిలిన 16.9 శాతం వనరులు పెద్ద, మధ్యతరహా రైతుల యాజమాన్యంలో ఉన్నాయి.
81% సబ్ మెర్సిబుల్ పంపులే..
16,79,868 చిన్న నీటిపారుదల వనరుల్లో 15,96,852 వనరుల నుంచి నీళ్లను తోడడానికి మోటార్లను వినియోగిస్తున్నారు. అందులో 13,03,446 (81.6%) సబ్ మెర్సిబుల్ పంపులు, 2,60,626 (16.3%) సాధారణ పంపు మోటార్లను వినియోగిస్తున్నారు. 893 (0.1శాతం) వనరుల నుంచి మనుషులు, జంతువుల సహాయంతో నీళ్లను తోడుతున్నారు.
41.6 శాతం భూగర్భ పైప్‌లైన్ ఆధారిత వనరులు..
చిన్న నీటిపారుదల వనరుల్లో 6,75,008 (41.6%) వనరులు భూగర్భ పైప్‌లైన్ ద్వారా, 3,98,977 (24.6%) వనరులు లైనింగ్ లేని కాల్వల ద్వారా, 2,32,821 (14.4%) వనరులు భూ ఉపరితల పైపుల ద్వారా, లైన్డ్ కాల్వల ద్వారా 2,30,859 ( 14.2%) వనరులు, 42,858 (2.6%) వనరులు డ్రిప్, 31,523 (1.9%) వనరులు స్ప్రింకర్ల ద్వారా, మిగిలిన 9,045 (0.7%) వనరులు ఇతర పరికరాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాయి.
96.5% వనరులు వినియోగంలో..
మొత్తం 16,79,868 వనరుల్లో 16,21,091 (96.5%) శాతం వినియోగంలో ఉండగా, 35,798 ( 2.1%) తాత్కాలికంగా, 22,979 (1.4%) వనరులు శాశ్వతంగా వినియోగంలో లేవు.
16.3% పెరిగిన సామర్థ్యం..
రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వనరుల అభివృద్ధితో 16.3 శాతం సాగునీటి సామర్థ్యం పెరిగింది. 5వ గ ణన నాటికి 30,14,446 హెక్టార్లు ఉన్న ఆయకట్టు 6 వ గణనలో 35,06,333 హెక్లార్లకు పెరిగింది. 5వ గణన నాటికి 22,06,925 హెక్టార్ల ఆయకట్టు విని యోగంలో ఉండగా, 6వ గణనలో వినియోగం 28, 88,483 (30.9 శాతం వృద్ధి) హెక్టార్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment