
ఎస్సారెస్పీకి భారీ వరద
ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు పెరిగిన ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు తగ్గగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా ఉంది. ఆదివారం ఎస్సారెస్పీకి 3 లక్షలు, ఎల్లంపల్లికి 2.27 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చింది. ఎల్లంపల్లికి సోమవారం ఉదయం ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఎగువన మహారాష్ట్రలోని లాతూర్‌లో భారీ వర్షాలు కురవడంతో దిగువకు భారీగా నీరొచ్చింది. సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టింది. నిజాంసాగర్‌లోకి 49,375, సింగూరులోకి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.
ఈ ప్రాజెక్టులన్ని ఇప్పటికే పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్టుకు సోమవారం 30 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా 17 వేల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు 16 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 202.5 టీఎంసీలకు చేరింది. ఇక్కడ విద్యుదుత్పత్తి చేస్తూ 36,277 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.