సాక్షి, హైదరాబాద్ : కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పదేళ్ల తర్వాత అంతటి వరద కేవలం 25 రోజుల్లోనే శ్రీశైలాన్ని చేరింది. 2010–11లో 1,024 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం ఈ నెలలోనే 865 టీఎంసీల మేర వరద వచ్చింది. అయితే కృష్ణా బేసిన్‌లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీనికితోడు అక్టోబర్‌లో తుపానుల ప్రభావం సైతం ఎక్కువగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే శ్రీశైలంలో ఈ ఏడాది వరద వెయ్యి టీఎంసీల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీటిలో ఈ ఏడాది సాగర్‌కు 569 టీఎంసీల మేర నీరు చేరింది. ఇది సైతం ఈ పదేళ్ల కాలంలో ఇదే గరిష్టం. ఇక ఈ ఒక్క నెలలోనే 343 టీఎంసీల మేర నీరు సముద్రంలో కలిసింది. 2013–14లో 399 టీఎంసీల నీరు సముద్రంలో కలవగా ఆరేళ్ల తర్వాత ఇప్పుడే అంతమేర నీరు సముద్రానికి చేరింది. 2017–18లో సున్నా, 2018–19లో 39 టీఎంసీల మేర సముద్రంలో కలిసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల్లోకి వరద పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మళ్లీ వర్షాలు కురిస్తేనే వరద మొదలు కానుంది. ఇక గోదావరి పరిధిలో ఇప్పటివరకు 1685 టీఎంసీల మేర నీరు సముద్రంలోకి వెళ్లినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి.
25 రోజుల్లోనే 865 టీఎంసీలు
Published Mon, Aug 26 2019 2:33 AM | Last Updated on Mon, Aug 26 2019 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment