సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై ఇప్పటికైనా తేల్చాలని తెలంగాణ కృష్ణాబోర్డును ఇటీవల కోరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమకు సంబంధించి తెలంగాణకు దక్కే 45 టీఎంసీల నీటి వాటాను ఈ ఏడాదైనా రాష్ట్రానికి సర్దాలని కోరింది. రాష్ట్ర అవసరాలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా, ట్రిబ్యునళ్లు తేల్చేవరకు చూడకుండా ఈ ఏడాది వర్షాకాలం నుంచే అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని మరోమారు బోర్డుకు రాసిన లేఖలో కోరింది. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువనున్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి.80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది.
ప్రస్తుతం ఎగువన ఉన్నది తెలంగాణే..
ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది. గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీలలో ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయ సముద్రానికి కేటాయించాలని ఇదివరకే బోర్డును, కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం ఏకే బజాజ్ కమిటీని నియమించినా, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది.
బోర్డు సైతం ట్రిబ్యునలే పరిష్కారం చేయగలదని చెబుతోంది. ఇప్పటికే ఏపీ.. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించడం, జూన్ నుంచి సీజన్ ఆరంభమైతే మళ్లీ నీటిని తరలించే అవకాశం ఉండటంతో వాటాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ట్రిబ్యునళ్లు తేల్చేవరకు నీటి వాటాలను ఇవ్వకుంటే నష్టపోతామని పేర్కొంది. మధ్యేమార్గంగా ఈ సీజన్ నుంచే 45 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశమివ్వాలని కోరింది.
‘పట్టిసీమ’ వాటా.. ఈ మారైనా సర్దండి
Published Thu, Jan 31 2019 2:22 AM | Last Updated on Thu, Jan 31 2019 2:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment