మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్‌! | availability of Godavari river water availability details are missing Says CWG | Sakshi
Sakshi News home page

మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్‌!

Published Wed, May 22 2019 3:13 AM | Last Updated on Wed, May 22 2019 3:13 AM

 availability of Godavari river water availability details are missing Says CWG - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశంపై కేంద్రం చేతులెత్తేసింది. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివరాలేవీ తమ వద్ద లేని నేపథ్యంలో ఈ అంశంపై తేల్చలేమంటూ తప్పించుకుంది. గడిచిన ఐదేళ్లుగా కమిటీలు, సమావేశాలంటూ కాలయాపన చేసిన కేంద్ర జల సంఘం తాజాగా గోదావరి నీటి లభ్యత అంశాలేవీ తమ వద్ద లేవన్న కారణాన్ని సాకుగా చూపెట్టి ఈ అంశాన్ని మరుగున పడేసే యత్నాలకు దిగింది.  

ఈ ఏడాది దక్కనట్లే..
గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువనున్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. 80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది.

గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీల్లో ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయసముద్రానికి కేటాయించాలని రాష్ట్రం గడిచిన ఐదేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ సహా హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులోనూ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరింది. దీనిపై కేంద్రం మూడేళ్ల కింద ఏకే బజాజ్‌ కమిటీని నియమించినా, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. అనంతరం జరిగిన కృష్ణాబోర్డు సమావేశాల్లో దీన్ని తెలంగాణ ప్రస్తావిస్తున్నా.. బోర్డు సైతం ట్రిబ్యునలే పరిష్కారం చేయగలదని చెబుతోంది.

వాటాలు తేల్చకుంటే నష్టమే..
ఇప్పటికే ఏపీ.. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించడం, జూన్‌ నుంచి సీజన్‌ ఆరంభమైతే మళ్లీ నీటిని తరలించే అవకాశం ఉండటంతో వాటాల అంశాన్ని తెలంగాణ గత నెలలో మరోమారు తెరపైకి తెచ్చింది. ట్రిబ్యునళ్లు తేల్చేవరకు నీటి వాటాలను ఇవ్వకుంటే నష్టపోతామని పేర్కొంది. మధ్యేమార్గంగా ఈ సీజన్‌ నుంచే 45 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశమివ్వాలని బోర్డును కోరింది. దీనిపై బోర్డు కేంద్ర జల సంఘాన్ని వివరణ కోరగా.. ఇటీవలే దానికి సమాధానం పంపింది.

గోదావరిలో మొత్తంగా ఉన్న నీటి లభ్యత, సముద్రంలో కలుస్తున్న నీరు, ప్రధాన ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగం, రాష్ట్రాలకు ఉన్న డిమాండ్‌ తదితరాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం కృష్ణా బోర్డుకు స్పష్టం చేసింది. కనీసం ఈ వివరాలేవీ గోదావరి బోర్డు వద్ద సైతం లేవని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా మళ్లింపు జలాలపై తేల్చజాలమని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లైంది. దీంతో ఈ ఏడాది మళ్లింపు జలాల వాటా రాష్ట్రానికి దక్కడం గగనంగానే మారనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement