Godavari river waters
-
తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించొద్దు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జలాలను వినియోగించుకోవడానికి చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పిస్తూ తెలంగాణ సర్కార్ పేర్కొన్న నీటి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని స్పష్టంచేసింది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవడం లేదా జలాలను కొత్త ట్రిబ్యునల్ పంపిణీ చేసే వరకూ తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించవద్దంటూ ఏపీ సర్కార్ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ, గోదావరి బోర్డులకు లేఖ రాసింది. అలాగే, గత నెల 30న సీతారామ ఎత్తిపోతల పథకం తొలిదశ డీపీఆర్‌పై కూడా అభ్యంతరం వ్యక్తంచేస్తూ లేఖ రాసింది. మిగతా ఐదింటిపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్‌శక్తి శాఖకు, గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులకు నీటి లభ్యత ఏదీ? ► మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గోదావరి పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఉన్నాయి. తెలంగాణకు ఎగువనున్న రాష్ట్రాల నుంచే 11 ఉప నదులు ప్రవహించి గోదావరిలో కలుస్తున్నాయి. ఒక్క శబరి మాత్రమే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తుంది. ఇక భౌగోళికంగా ఏపీకి ఎగువనున్న తెలంగాణ ఏడాది పొడవునా గోదావరి జలాలు వాడుకునే అవకాశం ఉంది. ► 2016, జనవరి 21న జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదా కొత్త ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారే కోరింది. ► అనంతరం.. అదే ఏడాది నవంబర్ 16న జరిగిన బోర్డు నాలుగో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఏపీ వాటా 775.9.. తెలంగాణ వాటా 649.8 టీఎంసీలు. ఇక 2004లో వ్యాప్కోస్ చేసిన అధ్యయనం ప్రకారం 2 రాష్ట్రాల పరిధిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. ► రెండు రాష్ట్రాలు కలిపి ఇప్పటికే 1425.7 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు నీటి లభ్యతలేదు. మిగులు జలాలు ఏపీవే.. ► గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. జీ–1 నుంచి జీ–11 సబ్ బేసిన్ల వరకూ ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నికర జలాలతోపాటూ మిగులు జలాలు ఏపీకే దక్కుతాయి. ► గోదావరి వరద జలాల ఆధారంగా ఏపీ 320 టీఎంసీలు.. తెలంగాణ 450.3 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు చేపట్టాయి. దీంతో ఏపీ ప్రాజెక్టులకు 1,095.9, తెలంగాణ ప్రాజెక్టులకు 1,100.1 టీఎంసీలు కలిపి మొత్తం 2,196 టీఎంసీల అవసరం ఉంది. కానీ, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ కొత్తవే. వీటితోపాటూ కాళేశ్వరం సామర్థ్యాన్ని అదనంగా 225 టీఎంసీలకు.. సీతారామ సామర్థ్యాన్ని మరో 30 టీఎంసీలకు పెంచే ప్రాజెక్టులూ కొత్తవే. ► కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతలపై 2018లోనే అభ్యంతరాలు వ్యక్తంచేశాం. కానీ, సీడబ్ల్యూసీలో కొన్ని విభాగాలు అనుమతులిచ్చాయి. వాటిని తక్షణమే పునఃసమీక్షించాలి. ► ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా ఆయకట్టు దెబ్బతింటాయని.. వాటిని అడ్డుకుని దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలని 2020, జూన్ 5న జరిగిన గోదావరి బోర్డు తొమ్మిదో భేటీలో కోరాం. ► 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో 2 రాష్ట్రాలకు గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుల పనుల్లో ముందుకెళ్లొద్దని ఆదేశించారు. ► ఏపీ హక్కులను దెబ్బతీసేలా.. అనుమతిలేకుండా తెలంగాణ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని షెకావత్‌కు అపెక్స్ కౌన్సిల్ భేటీలో సీఎం జగన్ లేఖ ఇచ్చారు. ట్రిబ్యునల్‌కు విరుద్ధంగా నీటి మళ్లింపు ► గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా తెలంగాణ నీటిని మళ్లిస్తోంది. జీ–10 సబ్ బేసిన్లో ఎగువనున్న ప్రాజెక్టుల వినియోగానికి 301.34 టీఎంసీలను మినహాయించుకుని.. పోలవరం వద్ద 561 టీఎంసీల లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ లెక్కగట్టి అనుమతిచ్చింది. ► దీంతో జీ–10 సబ్ బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కేటాయించిన 20 టీఎంసీలుపోనూ.. మిగిలిన 281.34 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం తెలంగాణకు ఉంటుంది. ► ఇక ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి గోదావరి జలాలను మళ్లించకూడదని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ట్రిబ్యునల్ అవార్డును పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా నీటిని మళ్లిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దు. తెలంగాణ సర్కార్ కొత్త ప్రాజెక్టులు ఇవే.. ► పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి (తుపాలకులగూడెం బ్యారేజీ) ► సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ ► ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం ూ చనాకా–కొరటా బ్యారేజీ ► చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం ూ మొడికుంట వాగు ప్రాజెక్టు కేంద్రం, గోదావరి బోర్డుకు వాస్తవాలను చెప్పాం గోదావరి జలాల వినియోగంలో వాస్తవాలను కేంద్రానికి, గోదావరి బోర్డుకు వివరించాం. తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులను చేపట్టింది. వీటి డీపీఆర్‌లను పరిశీలించవద్దని.. ఆమోదించవద్దని కోరాం. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కూ లేఖ రాశాం. తెలంగాణ డీపీఆర్లన్నింటినీ అధ్యయనం చేసి.. వాటిపైనా లేఖలు రాస్తాం. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరుతాం. – జె. శ్యామలరావు, కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ -
‘పట్టిసీమ’ వాటా.. ఈ మారైనా సర్దండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశమై ఇప్పటికైనా తేల్చాలని తెలంగాణ కృష్ణాబోర్డును ఇటీవల కోరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమకు సంబంధించి తెలంగాణకు దక్కే 45 టీఎంసీల నీటి వాటాను ఈ ఏడాదైనా రాష్ట్రానికి సర్దాలని కోరింది. రాష్ట్ర అవసరాలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా, ట్రిబ్యునళ్లు తేల్చేవరకు చూడకుండా ఈ ఏడాది వర్షాకాలం నుంచే అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని మరోమారు బోర్డుకు రాసిన లేఖలో కోరింది. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువనున్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి.80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువన ఉన్నది తెలంగాణే.. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయినందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది. గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీలలో ఎస్ఎల్బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయ సముద్రానికి కేటాయించాలని ఇదివరకే బోర్డును, కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం ఏకే బజాజ్ కమిటీని నియమించినా, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చేతులెత్తేసింది. బోర్డు సైతం ట్రిబ్యునలే పరిష్కారం చేయగలదని చెబుతోంది. ఇప్పటికే ఏపీ.. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని తరలించడం, జూన్ నుంచి సీజన్ ఆరంభమైతే మళ్లీ నీటిని తరలించే అవకాశం ఉండటంతో వాటాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ట్రిబ్యునళ్లు తేల్చేవరకు నీటి వాటాలను ఇవ్వకుంటే నష్టపోతామని పేర్కొంది. మధ్యేమార్గంగా ఈ సీజన్ నుంచే 45 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశమివ్వాలని కోరింది. -
‘దేవాదుల’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సమృద్ధిగా నిధులు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ) తరహాలోనే దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీలను కలుపుతూ సంయుక్తంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా నిధుల సమీకరణను వీలైనంత త్వరగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టు అధికారుల నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లినట్లుగా తెలిసింది. ‘జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ తుపాకులగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్’ పేరుతో ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని రిజిస్ట్రేషన్ చేసే పనులను ఇప్పటికే ప్రారంభించినట్లుగా సమాచారం. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే నిధుల వేటను ప్రభుత్వం మొదలుపెట్టే అవకాశాలున్నాయి. భారీగా నిధుల అవసరాలు.. గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును చేపట్టింది. తొలుత ఈ ప్రాజెక్టుకు 38.18 టీఎంసీల నీటిని కేటాయించగా తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం 2015లో నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోనూ కొన్ని కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 9,427.73 కోట్ల నుంచి రూ. 13,445.44 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రస్తుతం సుమారుగా రూ. 8,800 కోట్ల మేర నిధుల ఖర్చు జరగ్గా మరో రూ. 4,700 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. దీనికితోడు ఇటీవలే ప్రాజెక్టు పరిధిలో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. 10.78 టీఎంసీల సామర్థ్యంతో రూ. 3,300 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో ప్రాజెక్టు కింద నిధుల అవసరాలు రూ. 8 వేల కోట్లకు పెరిగాయి. ఇక దేవాదులకు నీటి లభ్యతను పెంచేందుకు వీలుగా దాని దిగువన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణాన్ని రూ. 2,121 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు రూ. 80 కోట్ల మేర ఖర్చు జరగ్గా మరో రూ. 1,900 కోట్ల నిధుల అవసరాలున్నాయి. రూ. పది వేల కోట్లు అవసరం దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టులను 2019 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ. 10 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు పూర్తికి భారీగా నిధులు సమకూరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు ఆ స్థాయి నిధుల కేటాయింపు సాధ్యమయ్యేది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగానే కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీలకు కలిపి రూ. 10 వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతుండగా ఇందులో కనిష్టంగా రూ. 5 వేల కోట్లు, గరిష్టంగా రూ. 7 వేల కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు పూర్తికి ప్రణాళిక రూపకల్పన, పనుల మదింపు, నిధుల విడుదల, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కార్పొరేషన్‌కే ప్రభుత్వం అప్పగించనుంది. ఆర్థిక సంస్థలతో చర్చలు, నిధుల ఖర్చు వ్యవహారాలన్నీ కార్పొరేషనే చూసుకోవాల్సి ఉంటుంది. -
రెండు ‘ఎత్తిపోతల’కు పచ్చజెండా
తుమ్మిళ్ల, కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి నీటి తరలింపు పథకాలకు కేబినెట్ ఆమోదం ► కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, ఇతర రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియకు ఓకే ► పాలమూరులోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–16 మార్పులకు ఆమోదం సాక్షి, హెదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా ఉన్న నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చి, మరింత ఆయకట్టుకు నీరిచ్చేందుకు వీలుగా మరో రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు శనివారం రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి రివర్సబుల్ పంపింగ్ విధానంలో శ్రీరాంసాగర్‌కు తరలించే ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కింది ఆయకట్టుకు నీరిచ్చేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటే కాళేశ్వరంలో ప్రధాన రిజర్వాయర్‌గా ఉన్న మల్లన్నసాగర్ సహా ఇతర నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి సమ్మతం తెలిపింది. సబ్ కమిటీ సిఫార్సులకు ఓకే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఎల్లంపల్లి నుంచి వరద కాలువ (ఎప్ఎఫ్సీ) ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలిస్తూ అదనపు (సప్లిమెంటేషన్) ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్సారెస్పీని 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం 9 లక్షల 73 వేల ఎకరాలకు సాగునీరందడానికి 95 టీఎంసీ లు కావాలి. ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ వంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాం సాగర్‌కు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఎస్సీరెఎస్పీలో 54 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నది. ఈ దృష్ట్యా పూర్తి ఆయకట్టుకు నీరందించడం కష్టంగా మారింది. ఈ దృష్ట్యా దాదాపు రూ.650 కోట్ల వ్యయ అంచనాలతో 105 మెగావాట్ల విద్యుత్తుతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మించేలా ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ నీటి తరలింపు పథకాన్ని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో రోజుకు 0.75 టీఎంసీల నీటిని ఈ పధకం నుంచి సరఫరా చేసి మొత్తంగా 43 టీఎంసీలు తరలించేలా ఈ పథకాన్ని రూపొందించగా దీనికి కేబినెట్ ఓకే చెప్పింది. 10 నెలల్లో దీన్ని పూర్తి చేసేలా నీటి పారుదల శాఖకు సూచన చేసింది. ఇక తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టేందుకు కేబినెట్ సమ్మతించింది. నిజానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉన్నా 4 టీఎంసీలకు మించి వాడటం లేదు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30వేల ఎకరాలకు కూడా అందడం లేదు. ఈ దృష్ట్యానే తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టాలని నిర్ణయించారు. మొత్తంగా 90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేసి, ఈ ప్రణాళికకు మొత్తంగా రూ.780 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టగా దీనికి ఆమోదం లభించింది. పాలమూరు రెండు ప్యాకేజీల్లో మార్పులు.. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–16లో మార్పులకు కేబినెట్ ఓకే చేసింది. ప్యాకేజీ–1, 16లో గతంలో చేసిన డిజైన్ కాకుండా ప్రస్తుత డిజైన్లు, ప్రాధమ్యాలకు తగినట్లుగా మార్పులు చేసేందుకు ఓకే చెప్పింది. ముఖ్యంగా ప్యాకేజీ–1లో భూ ఉపరితల పంప్‌హౌజ్‌ను కాకుండా, భూగర్భ పంప్‌హౌజ్ నిర్మాణానికి ఆమోదం చెప్పింది. ఈ మార్పుల కారణంగా ప్రాజెక్టుపై రూ.13కోట్ల భారం తగ్గుతోంది. ఇక ప్యాకేజీ–16లో భాగంగా ఉద్ధండాపూర్ రిజర్వాయర్ వద్ద స్టేజ్ పంప్‌హౌజ్ వద్ద ఓపెన్ చానల్, టన్నెల్లను ప్రతిపాదిస్తూ కాల్వల నిర్మాణం డిజైన్ చేయగా, ఇక్కడ ఆర్అండ్ఆర్, రైల్వే క్రాసింగ్ సమస్యలు వచ్చాయి. దీంతో ఓపెన్ చానల్ కాకుండా మొత్తంగా టన్నెల్ నిర్మాణం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీని వల్ల రైల్వే క్రాసింగ్‌తో పాటు, ఒక గ్రామాన్ని పూర్తిగా తప్పించవచ్చు. ఈ ప్యాకేజీలో జరుగుతున్న మార్పులతో ప్రభుత్వంపై రూ.16కోట్ల భారం తగ్గుతోంది. మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్ల పనులు వేగిరం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. మల్లన్నసాగర్ సహా మరో నాలుగు రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. మొత్తంగా రూ.10,876 కోట్లతో ఈ ఐదు రిజర్వాయర్లు చేపట్టాలని నిర్ణయిం చింది. 50 టీఎంసీలతో చేపట్టే మల్లన్నసాగర్ కు రూ.7,249.52కోట్ల అంచనా వేశారు. రంగనాయకసాగర్ రూ.496.50కోట్లు, కొండ పోచమ్మకు రూ.519.70కోట్లు, గంధమల రూ.860.25కోట్లు, బస్వాపూర్‌కు రూ.1,751 కోట్లతో టెండర్లు పిలవాలని ఆదేశించింది. మిడ్‌మానేరు టెండర్లు రద్దుచేసి కొత్తగా టెండ ర్లు పిలిచి పనులు చేపట్టాగా, దీనిని కేబినెట్ ఓకే చేసింది. ఇక తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపింది. -
‘గోదావరి’పై బ్యారేజీ!
22 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని యోచన దేవాదుల దిగువన నిర్మించేలా ప్రతిపాదన అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్: గోదావరి నదీ జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఈ మేరకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి దిగువన బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) తయారీకి ఆదేశిస్తూ మంగళవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. నీటి నిల్వ సామర్థ్యం ఎంత పెంచుకుంటే అంతమేర నీటిని సాగుకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. గోదావరిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశమున్నా కేవలం 400 టీఎంసీల నీటినే వాడుకుంటోంది. మిగిలిన 400 నుంచి 500 టీఎంసీల నీటిని వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణులు కమిటీ కూడా సూచించింది. దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు కనీసం 6 బ్యారేజీలైనా నిర్మాణం చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ మేరకే దేవాదుల ఎత్తిపోతలకు దిగువన ఏటూరునాగారం మండల పరిధిలోని గంగారం గ్రామం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. బ్యారేజీ నిర్మాణ డీపీఆర్ కోసం రూ.64.30 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. 22 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్‌హౌజ్ నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర సర్వే చేయాలని వివరించింది.