22 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని యోచన
దేవాదుల దిగువన నిర్మించేలా ప్రతిపాదన
అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్: గోదావరి నదీ జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఈ మేరకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి దిగువన బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) తయారీకి ఆదేశిస్తూ మంగళవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. నీటి నిల్వ సామర్థ్యం ఎంత పెంచుకుంటే అంతమేర నీటిని సాగుకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. గోదావరిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశమున్నా కేవలం 400 టీఎంసీల నీటినే వాడుకుంటోంది.
మిగిలిన 400 నుంచి 500 టీఎంసీల నీటిని వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణులు కమిటీ కూడా సూచించింది. దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు కనీసం 6 బ్యారేజీలైనా నిర్మాణం చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ మేరకే దేవాదుల ఎత్తిపోతలకు దిగువన ఏటూరునాగారం మండల పరిధిలోని గంగారం గ్రామం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. బ్యారేజీ నిర్మాణ డీపీఆర్ కోసం రూ.64.30 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. 22 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్‌హౌజ్ నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర సర్వే చేయాలని వివరించింది.
‘గోదావరి’పై బ్యారేజీ!
Published Wed, Aug 19 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement