సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సమృద్ధిగా నిధులు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ) తరహాలోనే దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీలను కలుపుతూ సంయుక్తంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా నిధుల సమీకరణను వీలైనంత త్వరగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టు అధికారుల నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లినట్లుగా తెలిసింది. ‘జె. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ తుపాకులగూడెం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్’ పేరుతో ఏర్పాటు చేసే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)ని రిజిస్ట్రేషన్ చేసే పనులను ఇప్పటికే ప్రారంభించినట్లుగా సమాచారం. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే నిధుల వేటను ప్రభుత్వం మొదలుపెట్టే అవకాశాలున్నాయి.
భారీగా నిధుల అవసరాలు..
గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును చేపట్టింది. తొలుత ఈ ప్రాజెక్టుకు 38.18 టీఎంసీల నీటిని కేటాయించగా తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం 2015లో నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోనూ కొన్ని కీలక మార్పులు జరిగిన నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 9,427.73 కోట్ల నుంచి రూ. 13,445.44 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రస్తుతం సుమారుగా రూ. 8,800 కోట్ల మేర నిధుల ఖర్చు జరగ్గా మరో రూ. 4,700 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. దీనికితోడు ఇటీవలే ప్రాజెక్టు పరిధిలో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. 10.78 టీఎంసీల సామర్థ్యంతో రూ. 3,300 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతో ప్రాజెక్టు కింద నిధుల అవసరాలు రూ. 8 వేల కోట్లకు పెరిగాయి. ఇక దేవాదులకు నీటి లభ్యతను పెంచేందుకు వీలుగా దాని దిగువన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణాన్ని రూ. 2,121 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు రూ. 80 కోట్ల మేర ఖర్చు జరగ్గా మరో రూ. 1,900 కోట్ల నిధుల అవసరాలున్నాయి.
రూ. పది వేల కోట్లు అవసరం
దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టులను 2019 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ. 10 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ప్రస్తుతం కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు పూర్తికి భారీగా నిధులు సమకూరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు ఆ స్థాయి నిధుల కేటాయింపు సాధ్యమయ్యేది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగానే కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీలకు కలిపి రూ. 10 వేల కోట్ల మేర నిధులు అవసరం అవుతుండగా ఇందులో కనిష్టంగా రూ. 5 వేల కోట్లు, గరిష్టంగా రూ. 7 వేల కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు పూర్తికి ప్రణాళిక రూపకల్పన, పనుల మదింపు, నిధుల విడుదల, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కార్పొరేషన్‌కే ప్రభుత్వం అప్పగించనుంది. ఆర్థిక సంస్థలతో చర్చలు, నిధుల ఖర్చు వ్యవహారాలన్నీ కార్పొరేషనే చూసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment