తాగునీటి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసింది
సాక్షి, హైదరాబాద్: తాగునీటి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కృష్ణా బోర్డు వర్కింగ్ గ్రూప్ సమావేశం ముగిసింది. బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ శనివారం ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 1.2 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. ఏపీ కోరినట్లుగా 6 టీఎంసీలు ఇచ్చే విషయంలో తెలంగాణ ఈఎన్‌సీ సానుకూలంగా స్పందించలేదు. కనీసం 4 టీఎంసీల విడుదలకైనా అంగీకరించాలని, మిగతా 2 టీఎంసీల విషయంలో తర్వాత నిర్ణయం వెలువరించాలని ఏపీ ఈఎన్‌సీ చేసిన విజ్ఞప్తికి కూ డా తెలంగాణ ఈఎన్‌సీ సానుకూలంగా స్పం దించలేదు. ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే ఏదైనా చెప్పగలమని సమాధానం ఇచ్చారు. ఆదివారం తెలంగాణ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
వేసవిలో నీటికి కటకట తప్పదు
కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. శనివారం శ్రీశైలంలో 55.05 టీఎంసీలు, సాగర్‌లో 129.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రానున్న వేసవిలో తాగునీటికి కటకట తప్పదని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. వేసవి రాకముందే జలాశయాలను ఖాళీ చేస్తే ఎండాకాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది.