ఏపీ చేస్తే ఒప్పు.. మాది మాత్రం తప్పా! | TS fires on krishna board | Sakshi
Sakshi News home page

ఏపీ చేస్తే ఒప్పు.. మాది మాత్రం తప్పా!

Published Tue, May 2 2017 12:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ఏపీ చేస్తే ఒప్పు.. మాది మాత్రం తప్పా! - Sakshi

ఏపీ చేస్తే ఒప్పు.. మాది మాత్రం తప్పా!

- కృష్ణా జలాల విషయంలో బోర్డు ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రం ఆగ్రహం
- టెలిమెట్రీపై ఏపీ వైఖరిని ఎందుకు ప్రశ్నంచలేదని నిలదీత
- బోర్డు సభ్యకార్యదర్శికి ఘాటు లేఖ


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల పంపిణీ, వినియోగం, నిర్వహణ విషయంలో బోర్డు ఏకపక్షంగా చేస్తున్న నిర్ణయాలపై తెలంగాణ తొలిసారి ఘాటుగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌కు వత్తాసు పలికేలా బోర్డు వ్యవహారం ఉందంటూ అభ్యంతరం తెలిపింది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి తమ తాగునీటి అవసరాలకు చేసిన నీటి వినియోగాన్ని, అదనపు వాటా కింద చూపి కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసిన కృష్ణాబోర్డు, టెలిమెట్రీ విషయంలో ఏపీ అడ్డుతగులుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీసింది. టెలిమెట్రీ మార్పుల విషయంలో సైతం రాష్ట్రానికి కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు రాష్ట్రం సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాసింది.

ఆదేశాలు మాకేనా..?
రాష్ట్ర పరిధిలోని జూరాల, ఏఎంఆర్‌పీ, సాగర్‌ ఎడమ కాల్వ కింద టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు పనులు పూర్తయినా, ఏపీ పరిధిలోని సాగర్‌ కుడి కాల్వ కింద మాత్రం ఇంతవరకు పనులు పూర్తవలేదని రాష్ట్ర ప్రభుత్వం బోర్డు సభ్యకార్యదర్శి దృష్టికి తెచ్చింది. కుడి కాల్వ కింద ఏపీ టెలిమెట్రీ పనులను అడ్డుకున్నా, దీనిపై వర్క్‌ ఏజెన్సీ లేఖ రాసినా, బోర్డు మాత్రం పట్టించుకోలేదని, ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. సాగర్‌కింద 3.26 టీఎంసీలు అదనంగా తెలంగాణ వాడిందంటూ కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసిన బోర్డు, టెలిమెట్రీ విషయంలో ఏపీ వైఖరిని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించింది. ఆదేశాలు మాకే తప్ప, ఏపీకి ఉండవా అని ప్రశ్నించింది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీకి ప్రతిపాదించగా, దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్‌ పాయింట్‌కు ఎవరిని అడిగి మార్చాలని సూటిగా ప్రశ్నించింది.

ఎందుకు మార్చుతున్నారన్నది చెప్పకుండా, రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేశారని పేర్కొంది. కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్‌ వరకు మధ్యలో 4,500 ఎకరాలకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథకాలను ఏపీ నిర్వహిస్తోందని, బంకచర్ల వరకు తాగునీటి పథకాలు సైతం ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పాయింట్‌మారిస్తే ఈ నీటి వినియోగమేదీ లెక్కలోకి రాదని తేల్చిచెప్పింది. ఈ సమయంలోనే సాగర్‌ ఎడమ గట్టు కాల్వలపై ఏపీ, తెలంగాణ సరిహద్దులో 101.36 కిలోమీటర్‌ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాన్ని 102.63 కిలోమీటర్‌కు మార్చాలని నిర్ణయించడాన్ని రాష్ట్రం తప్పుపట్టింది. పాయింట్‌ మారిస్తే ఏపీ పరిధిలోని నూతిపాడు కింద రెండు ఎత్తిపోతల పథకాల కింద జరిగే నీటి వినియోగం లెక్కలోకి రాదని, ఈ దృష్ట్యా మార్పులకు అంగీకరించమని స్పష్టం చేసింది.

వివక్షను సహించబోం..
రెండో విడత టెలిమెట్రీలో 29 చోట్ల ఏర్పాటుకు అంగీకరించగా, 15 చోట్ల ఏర్పాటుపై ఏపీ అనేక అభ్యంతరాలు చెబుతోందని తెలిపింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న టెలిమెట్రీ ప్రాంతాలన్నీ కృష్ణాడెల్టా వ్యవస్థ, తుంగభద్ర, పోతిరెడ్డిపాడు ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపింది. గతంలో కుదిరిన అవగాహన మేరకు ఇరు ప్రాంతాల్లో సమాన స్థాయిలో టెలిమెట్రీ పరికరాలు అమర్చే ప్రక్రియ జరగాల్సి ఉన్నా, తెలంగాణలో మాత్రమే వేగంగా జరుగుతోందని తెలిపింది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ సమన్యాయం జరిగేలా బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించింది. వివక్షను ఒప్పుకోమని పేర్కొంది. కాగా ఇదే విషయాన్ని ఈ నెల 5న జరిగే త్రిసభ్య కమిటీ భేటీలోనూ ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement