సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టులపై పెత్తనాన్ని పూర్తిగా బోర్డుకే కట్టబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర జల వనరుల శాఖ తాజాగా మరో కీలక సూచన చేసినట్లుగా తెలిసింది. ప్రాజెక్టులన్నింటినీ ఒకేమారు నియంత్రణలోకి తెచ్చుకోవడం కాకుండా, దశల వారీగా తెచ్చుకోవాలని కృష్ణాబోర్డుకు సూచించినట్లుగా తెలిసింది. ఈ సూచనల మేరకు తొలివిడతగా 6 ప్రాజెక్టులను తన అధీనంలోకి తీసుకునేలా బోర్డు కసరత్తులు ఆరంభించింది.
కృష్ణాబేసిన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలోఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్వహణను తమకు అప్పగించాలని తొలి నుంచీ బోర్డు పట్టుబడుతోంది. దీనికి అంగీకరించిన కేంద్రం, విడతల వారీగా ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని సూచించింది. కేంద్రం సూచించిన వాటిలో జూరాల ప్రాజెక్టు, సుంకేశుల బ్యారేజీ, ఆర్డీఎస్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌లు ఉన్నాయి.
శ్రీశైలం పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి, కల్వకుర్తి, కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలతోపాటు సాగర్ కింది కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్‌లు, ఏఎంఆర్‌పీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మాత్రం తొలి విడతలో చేర్చలేదు. ప్రాజెక్టుల నియంత్రణకు అవసరమయ్యే సిబ్బందిపై స్పష్టత రాగా, బోర్డు నిర్వహణకు 328 మంది సిబ్బంది అవసరం ఉంటుందని తేల్చింది. తొలివిడతలో బోర్డు అధీనంలోకి తెచ్చే అంశంపై ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చాక, బోర్డుకు సర్వాధికారాలు కట్టబెట్టే అంశంపై స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment