గోదా‘వరద’ ఏదీ?
- గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ప్రవాహాలు
- గతేడాది కాళేశ్వరం వద్ద 102 మీటర్లలో ప్రవాహాలు, ప్రస్తుతం 95 మీటర్లలోనే
- ఎగువ గైక్వాడ్ సహా రాష్ట్ర ప్రాజెక్టుల్లో నిరాశాజనకంగా నిల్వలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయనిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ప్రతి ఏటా జూన్ చివరి వారానికి ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులోనూ గతేడాదితో పోలిస్తే ఏకంగా 17 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది.
చూపంతా పైకే..
కృష్ణా బేసిన్‌తో పోల్చిచూస్తే గోదావరి బేసిన్‌లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్‌లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో ఇంతవరకు ఒక్క పెద్ద వర్షం నమోదు కాకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరు, శ్రీరాంసాగర్‌కు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి 20 రోజులు కావస్తున్నా దిగువకు వచ్చింది తక్కువే.
గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద గత ఏడాది జూన్ 17, 18 తేదీల్లోనే గోదావరి 102 మీటర్ల మట్టంతో ప్రవహించింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండగా అది ఈ ఏడాది 40 వేల క్యూసెక్కులకే పరిమితం అయింది. ఈ ప్రవాహం కూడా ప్రాణహిత నుంచి వస్తోందే తప్ప, గోదావరి నుంచి కాదు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుధవారం కాళేశ్వరం వద్ద 80 వేల క్యూసెక్కులకు వరద పెరిగినట్లుగా తెలుస్తోంది.
మిగులు జలాలూ అంతే..
ఇక ప్రతి ఏటా ధవళేశ్వరం దిగువన సముద్రంలో కలిసే గోదావరి మిగులు జలాల నీటి పరిమాణం సైతం తగ్గింది. ఈ ఏడాది సముద్రంలో కలిసిన నీరు 82.9 టీఎంసీలు ఉండగా, గతేడాది ఇదే సమయానికి 390 టీఎంసీలు, అంతకుముందు ఏడాది 710 టీఎంసీల మేర సముద్రంలో కలిసింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు రెండు రోజులుగా మాత్రమే ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. ఇక కడెం, శ్రీరాంసాగర్‌లోనూ గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. వీటికి పెద్దగా ప్రవాహాలు సైతం రావడం లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎగువ మహారాష్ట్రలో కురిసే వర్షాలపైనే రాష్ట్ర ఆశలు ఆధారపడి ఉన్నాయి.
ఇంకో 90 వస్తే దిగువకు కృష్ణా..
కృష్ణా బేసిన్‌లోని ఎగువ ఆల్మట్టికి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 38 క్యూసెక్కుల మేర నీరొచ్చి చేరడంతో అక్కడ నీటి నిల్వ 129 టీఎంసీలకు గానూ 55.27 టీఎంసీల మేర ఉంది. దిగువ నారాయణపూర్‌కు ప్రవాహాలు లేకపోవడంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 14.69 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువన మరో 90 టీఎంసీలు వస్తే దిగువ జూరాలకు నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంది.