Gaikwad Project
-
గోదా‘వరద’ ఏదీ?
- గతంతో పోలిస్తే భారీగా తగ్గిన ప్రవాహాలు - గతేడాది కాళేశ్వరం వద్ద 102 మీటర్లలో ప్రవాహాలు, ప్రస్తుతం 95 మీటర్లలోనే - ఎగువ గైక్వాడ్ సహా రాష్ట్ర ప్రాజెక్టుల్లో నిరాశాజనకంగా నిల్వలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయనిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ప్రతి ఏటా జూన్ చివరి వారానికి ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులోనూ గతేడాదితో పోలిస్తే ఏకంగా 17 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. చూపంతా పైకే.. కృష్ణా బేసిన్‌తో పోల్చిచూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో ఇంతవరకు ఒక్క పెద్ద వర్షం నమోదు కాకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరు, శ్రీరాంసాగర్‌కు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి 20 రోజులు కావస్తున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద గత ఏడాది జూన్ 17, 18 తేదీల్లోనే గోదావరి 102 మీటర్ల మట్టంతో ప్రవహించింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండగా అది ఈ ఏడాది 40 వేల క్యూసెక్కులకే పరిమితం అయింది. ఈ ప్రవాహం కూడా ప్రాణహిత నుంచి వస్తోందే తప్ప, గోదావరి నుంచి కాదు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుధవారం కాళేశ్వరం వద్ద 80 వేల క్యూసెక్కులకు వరద పెరిగినట్లుగా తెలుస్తోంది. మిగులు జలాలూ అంతే.. ఇక ప్రతి ఏటా ధవళేశ్వరం దిగువన సముద్రంలో కలిసే గోదావరి మిగులు జలాల నీటి పరిమాణం సైతం తగ్గింది. ఈ ఏడాది సముద్రంలో కలిసిన నీరు 82.9 టీఎంసీలు ఉండగా, గతేడాది ఇదే సమయానికి 390 టీఎంసీలు, అంతకుముందు ఏడాది 710 టీఎంసీల మేర సముద్రంలో కలిసింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు రెండు రోజులుగా మాత్రమే ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. ఇక కడెం, శ్రీరాంసాగర్లోనూ గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. వీటికి పెద్దగా ప్రవాహాలు సైతం రావడం లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎగువ మహారాష్ట్రలో కురిసే వర్షాలపైనే రాష్ట్ర ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఇంకో 90 వస్తే దిగువకు కృష్ణా.. కృష్ణా బేసిన్‌లోని ఎగువ ఆల్మట్టికి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 38 క్యూసెక్కుల మేర నీరొచ్చి చేరడంతో అక్కడ నీటి నిల్వ 129 టీఎంసీలకు గానూ 55.27 టీఎంసీల మేర ఉంది. దిగువ నారాయణపూర్‌కు ప్రవాహాలు లేకపోవడంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 14.69 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువన మరో 90 టీఎంసీలు వస్తే దిగువ జూరాలకు నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంది. -
ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని పుష్కరాలకు వదలాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని యుద్ధప్రాతిపదికన పుష్కర ఘాట్లకు మళ్లించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎగువ నీటి విడుదలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. చివరి నిమిషం వరకు ఆగకుండా.. 12వ తేదీలోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇదే సమయంలో పుష్కర ఘాట్ల పరిస్థితి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ అధికారులు వారికి కేటాయించిన ఘాట్ల వద్ద ఉన్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. స్నానాల గదులకు సంబంధించిన విషయంలో ఎక్కడా అజాగ్రత్త వహించరాదని, ఘాట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఘాట్ల వద్ద వేస్తున్న కొత్త రోడ్ల పక్కన నాణ్యమైన మొరం వేయాలని, ప్రమాదల నివారణకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కరాలకు వచ్చే దృష్ట్యా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, పిండప్రదానం చేసే పురోహితులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారికి చెల్లించాల్సిన ధరల పట్టికను ఘాట్ల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలు జరిగే జిల్లాలో టోల్‌ఫ్రీతో కూడిన హెల్ప్‌లైన్ సెంటర్‌ను ప్రచారంలో పెట్టాలని, ఘాట్ల వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని సూచించారు. కాగా మంత్రి ఆదేశానుసారం ఎస్సారెస్పీ అధికారులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రాజెక్టు నుంచి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. క్రమంగా ఆ నీటిని రెండు వేల క్యూసెక్కుల వరకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇక కడెం ప్రాజెక్టు నుంచి సైతం శనివారం నీటిని వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. ఇక్కడ సైతం తొలి దశలో 500 క్యూసెక్కుల నీటిని వదిలి తర్వాత పరిస్థితిని బట్టి నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలపై సీఎం విన్నపం ఎగువన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నాలుగైదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్ ఆర్.విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ ద్వారా విన్నవించినట్లు తెలుస్తోంది. బాసర వరకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై మంత్రి హరీశ్ సైతం ఆ రాష్ట్ర గవర్నర్, ఇతర అధికారులతో మాట్లాడినట్లుగా తెలిసింది. -
‘గైక్వాడ్’ నీటి ఆశలు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుంభమేళా తరహాలో నిర్వహించ తలపెట్టిన గోదావరి పుష్కరాలకు ఎగువ గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీళ్లొస్తాయన్న ఆశలకు గండి పడింది. గైక్వాడ్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీకి చేరడంతో రాష్ట్రం కోరినట్లుగా నీటిని ఇచ్చేందుకు మహారాష్ట్ర విముఖత చూపింది. ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని ఔరంగాబాద్ పట్టణ తాగునీటి అవసరాలను తీర్చేందుకే వినియోగించాల్సి ఉన్న దృష్ట్యా మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ప్రాథమిక సమాచారం అందినట్లుగా తెలిసింది. గోదావరి బేసిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి దృష్ట్యా ఎగువ నుంచి సుమారు నాలుగైదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మహారాష్ట్రకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. గైక్వాడ్ ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 102 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 27 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు సైతం డెడ్‌స్టోరేజీకి దగ్గరగా ఉంది. ఒకవేళ గే ట్లు తెరిచినా అందులోంచి వచ్చే ఒకటి, రెండు టీఎంసీల నీరు 400 కిలోమీటర్లు దాటి రావాలంటే కష్టమే. మధ్యలోనే నీరు ఇంకిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తాగు అవసరాలకు నీటిని నిల్వ చేయకుండా, పక్క రాష్ట్ర అవసరాలకు ఇవ్వడం మహారాష్ట్రకు ఇబ్బందిగా మారుతుంది. ఈ దృష్ట్యానే నీటిని ఇవ్వలేమని మహారాష్ట్ర సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం గైక్వాడ్ నీటిపై ఆశలు గల్లంతు కావడంతో ఎస్సారెస్పీపైన బాసర వరకు ఉన్న ఏడు ఘాట్లకు నీరు అందడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తిగా షవర్ల ద్వారానే నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఒక క్రమపద్ధతిలో కొంచెంకొంచెంగా నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ నీటి విడుదల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. -
గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీరివ్వండి
మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌కు హరీశ్‌రావు లేఖ మహారాష్ట్ర ప్రభుత్వంతో నేడో, రేపో చర్చలు! హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి కనీసం నాలుగైదు టీఎంసీల నీటిని రెండు, మూడు రోజుల్లో విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మహారాష్ట్ర జల వనరులశాఖ మంత్రి గిరీష్ మహాజన్‌కు లేఖ రాశారు. కుంభమేళా తరహాలో నిర్వహించతలపెట్టిన పుష్కరాలకు గోదావరి బేసిన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు అడ్డంకిగా మారాయని, ఈ దృష్ట్యా గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ వరకు విడుదల చేయాలని కోరారు. నీరు దిగువకు చేరేందుకు మూడురోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై చర్చించేందుకు బుధవారం సాయంత్రంగాని,గురువారం ఉదయంగాని నీటి పారుదల శాఖ అధికారులు మహారాష్ట్రకు వెళ్లనున్నట్లు తెలిసింది. పుష్కరాలపై ఇటీవల మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించి మహారాష్ట్రకు నీటి పారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ), గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్లను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్ సైతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడే అవకాశముందని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.