గోదావరి పుష్కరాలకు గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి కనీసం నాలుగైదు టీఎంసీల నీటిని రెండు, మూడు రోజుల్లో విడుదల
మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌కు హరీశ్‌రావు లేఖ
మహారాష్ట్ర ప్రభుత్వంతో నేడో, రేపో చర్చలు!
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి కనీసం నాలుగైదు టీఎంసీల నీటిని రెండు, మూడు రోజుల్లో విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మహారాష్ట్ర జల వనరులశాఖ మంత్రి గిరీష్ మహాజన్‌కు లేఖ రాశారు. కుంభమేళా తరహాలో నిర్వహించతలపెట్టిన పుష్కరాలకు గోదావరి బేసిన్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు అడ్డంకిగా మారాయని, ఈ దృష్ట్యా గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ వరకు విడుదల చేయాలని కోరారు.
నీరు దిగువకు చేరేందుకు మూడురోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై చర్చించేందుకు బుధవారం సాయంత్రంగాని,గురువారం ఉదయంగాని నీటి పారుదల శాఖ అధికారులు మహారాష్ట్రకు వెళ్లనున్నట్లు తెలిసింది. పుష్కరాలపై ఇటీవల మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించి మహారాష్ట్రకు నీటి పారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ), గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్‌లను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్ సైతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడే అవకాశముందని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.