Puskaralalu Godavari
-
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించండి
గోదావరి పుష్కరాలపై సమీక్షలో సీఎం కేసీఆర్ హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయని, అందువల్ల ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఏర్పాట్లు, ట్రాఫిక్ పరిస్థితిపై సీఎం శనివారం తన అధికార కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలతో సమీక్షించారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారని వారికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పుష్కరాల్లో బీ కేర్‌ఫుల్
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి రక్షణ, భద్రతపై అప్రమత్తంగా ఉండాలి భద్రాచలం, కాళేశ్వరంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించటంతో పాటు భద్రతా ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రక్షణ చర్యల విషయంలో ఆదమరిచి ఉండొద్దని, ఏ చిన్న పొరపాటూ జరగకుండా చూడాలని హెచ్చరించారు. భద్రాచలం, కాళేశ్వరం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈ రెండు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. దీంతో వారిద్దరు మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. పుష్కర ఘాట్ల వద్ద క్యూలైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులు స్నానాల కోసం లోతు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్య స్నానాలు ఆచరించేలా చూడాలన్నారు. ఘాట్ల వద్ద, ఆలయాల ప్రాంగణాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులు కాస్త ఎక్కువ శ్రమ తీసుకుని భక్తులకు సహకరించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా భద్రాచలంలో హెలికాప్టర్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు ఆరా తీసిన సీఎం ఏపీలో రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పుష్కరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభించిన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, రెవెన్యూ కార్యదర్శి మీనా, డీఐజీ మల్లారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఏఏ ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చాక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తుల దుర్మరణంపై దిగ్భ్రాంతి రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి మహా పుష్కరాలు సజావుగా జరిగేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థించారు. -
పుష్కరాల పనుల్లో వెయ్యి కోట్ల అవినీతి
తక్షణమే విచారణ జరిపించాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనుల్లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. దీనిపై తక్షణమే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి తల్లిని అవినీతి ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.500 కోట్లను జేబుల్లో నింపుకున్న చంద్రబాబు ఇప్పుడు పుష్కరాల కోసం కేటాయించిన నిధులను కూడా కాజేశారని విమర్శించారు. పుష్కరాల కోసం విడుదల చేసిన రూ.1,650 కోట్లలో రూ.850 కోట్లు రహదారుల నిర్మాణానికి కేటాయించారని చెప్పారు. ఏ రోడ్డును కూడా సక్రమంగా వేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు పెదరాయుడా?: అవినీతి సొమ్ముతో పాపాలను మూటగట్టుకున్న చంద్రబాబు పుష్కర స్నానం చేయకుంటేనే మంచిదని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన పుష్కరాల్లో స్నానం చేస్తే గోదావరి తల్లి అపవిత్రం అవుతుందని అన్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో పంచాయితీలు చేసే పెదరాయుడి పాత్ర పోషిస్తున్నారని చెవిరెడ్డి విమర్శించారు. పుష్కరాల్లో అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి: అంబటి గోదావరి పుష్కరాల పనుల్లో భారీగా చోటు చేసుకున్న అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పుష్కరాల పనులన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీలోని తన తాబేదారులకు, వారి అనుచరులకు కట్టబెట్టారని ఆరోపించారు. పుష్కరాల పనులను చాలా నాసిరకంగా చేశారని విమర్శించారు. -
గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీరివ్వండి
మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌కు హరీశ్‌రావు లేఖ మహారాష్ట్ర ప్రభుత్వంతో నేడో, రేపో చర్చలు! హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి కనీసం నాలుగైదు టీఎంసీల నీటిని రెండు, మూడు రోజుల్లో విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మహారాష్ట్ర జల వనరులశాఖ మంత్రి గిరీష్ మహాజన్‌కు లేఖ రాశారు. కుంభమేళా తరహాలో నిర్వహించతలపెట్టిన పుష్కరాలకు గోదావరి బేసిన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు అడ్డంకిగా మారాయని, ఈ దృష్ట్యా గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ వరకు విడుదల చేయాలని కోరారు. నీరు దిగువకు చేరేందుకు మూడురోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇదే విషయమై చర్చించేందుకు బుధవారం సాయంత్రంగాని,గురువారం ఉదయంగాని నీటి పారుదల శాఖ అధికారులు మహారాష్ట్రకు వెళ్లనున్నట్లు తెలిసింది. పుష్కరాలపై ఇటీవల మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించి మహారాష్ట్రకు నీటి పారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ), గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్లను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. అవసరమైతే సీఎం కేసీఆర్ సైతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడే అవకాశముందని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
పుష్కరాలకు 2,270 బస్సులు
హైదరాబాద్ నుంచి 530 25 లక్షల మందిని చేరవేయడమే లక్ష్యం టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం 2,270 బస్సులు నడుపుతున్నట్టు టీఎస్ ఆర్టీసీ జాయింట్ ఎండీ రమణరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలోని వివిధ పుష్కర ఘాట్లకు 25 లక్షల మంది భక్తులను చేరవేయడమే లక్ష్యంగా బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలి పారు. హైదరాబాద్ నుంచి 530, ఆదిలాబాద్- 310, నిజామాబాద్- 300, కరీంనగర్ -415, వరంగల్- 355, ఖమ్మం నుంచి 360 బస్సులు పుష్కర ఘాట్లకు భక్తులను చేరవేస్తాయని వివరించారు. హైదరాబాద్ నుంచి అన్ని పుష్కరఘాట్లకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రధాన ఘాట్లు అయిన బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంలకు అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రమణరావు వివరించారు. తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు, సమాచార కేంద్రాలు, విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యం, క్లాక్ రూం సౌకర్యంతో పాటు బస్స్టేషన్ల వద్ద 150 మంది అంతర్గత సిబ్బందిని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు. భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు.