పుష్కరాల్లో బీ కేర్‌ఫుల్
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
రక్షణ, భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
భద్రాచలం, కాళేశ్వరంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించటంతో పాటు భద్రతా ఏర్పాట్లపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రక్షణ చర్యల విషయంలో ఆదమరిచి ఉండొద్దని, ఏ చిన్న పొరపాటూ జరగకుండా చూడాలని హెచ్చరించారు. భద్రాచలం, కాళేశ్వరం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈ రెండు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు.
దీంతో వారిద్దరు మంగళవారం మధ్యాహ్నం హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు. పుష్కర ఘాట్ల వద్ద క్యూలైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులు స్నానాల కోసం లోతు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్య స్నానాలు ఆచరించేలా చూడాలన్నారు.
ఘాట్ల వద్ద, ఆలయాల ప్రాంగణాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, అన్ని శాఖల అధికారులు కాస్త ఎక్కువ శ్రమ తీసుకుని భక్తులకు సహకరించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా భద్రాచలంలో హెలికాప్టర్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
ఎప్పటికప్పుడు ఆరా తీసిన సీఎం
ఏపీలో రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పుష్కరాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు పుష్కర ఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలు ప్రారంభించిన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, రెవెన్యూ కార్యదర్శి మీనా, డీఐజీ మల్లారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఏఏ ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చాక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
భక్తుల దుర్మరణంపై దిగ్భ్రాంతి
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి మహా పుష్కరాలు సజావుగా జరిగేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థించారు.