పుష్కరాల పనుల్లో వెయ్యి కోట్ల అవినీతి
తక్షణమే విచారణ జరిపించాలి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్
హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనుల్లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. దీనిపై తక్షణమే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి తల్లిని అవినీతి ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో రూ.500 కోట్లను జేబుల్లో నింపుకున్న చంద్రబాబు ఇప్పుడు పుష్కరాల కోసం కేటాయించిన నిధులను కూడా కాజేశారని విమర్శించారు. పుష్కరాల కోసం విడుదల చేసిన రూ.1,650 కోట్లలో రూ.850 కోట్లు రహదారుల నిర్మాణానికి కేటాయించారని చెప్పారు. ఏ రోడ్డును కూడా సక్రమంగా వేయలేదని మండిపడ్డారు.
చంద్రబాబు పెదరాయుడా?: అవినీతి సొమ్ముతో పాపాలను మూటగట్టుకున్న చంద్రబాబు పుష్కర స్నానం చేయకుంటేనే మంచిదని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన పుష్కరాల్లో స్నానం చేస్తే గోదావరి తల్లి అపవిత్రం అవుతుందని అన్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో పంచాయితీలు చేసే పెదరాయుడి పాత్ర పోషిస్తున్నారని చెవిరెడ్డి విమర్శించారు.
పుష్కరాల్లో అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి: అంబటి
గోదావరి పుష్కరాల పనుల్లో భారీగా చోటు చేసుకున్న అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పుష్కరాల పనులన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీలోని తన తాబేదారులకు, వారి అనుచరులకు కట్టబెట్టారని ఆరోపించారు. పుష్కరాల పనులను చాలా నాసిరకంగా చేశారని విమర్శించారు.