ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు | Projects From Puskarala to water | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు

Published Sat, Jul 11 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు

ప్రాజెక్టుల నుంచి పుష్కరాలకు నీరు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని పుష్కరాలకు వదలాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని యుద్ధప్రాతిపదికన పుష్కర ఘాట్లకు మళ్లించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎగువ నీటి విడుదలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. చివరి నిమిషం వరకు ఆగకుండా.. 12వ తేదీలోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇదే సమయంలో పుష్కర ఘాట్ల పరిస్థితి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ అధికారులు వారికి కేటాయించిన ఘాట్‌ల వద్ద ఉన్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. స్నానాల గదులకు సంబంధించిన విషయంలో ఎక్కడా అజాగ్రత్త వహించరాదని, ఘాట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

ఘాట్ల వద్ద వేస్తున్న కొత్త రోడ్ల పక్కన నాణ్యమైన మొరం వేయాలని, ప్రమాదల నివారణకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పుష్కరాలకు వచ్చే దృష్ట్యా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, పిండప్రదానం చేసే పురోహితులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారికి చెల్లించాల్సిన ధరల పట్టికను ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలు జరిగే జిల్లాలో టోల్‌ఫ్రీతో కూడిన హెల్ప్‌లైన్ సెంటర్‌ను ప్రచారంలో పెట్టాలని, ఘాట్‌ల వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని సూచించారు.

కాగా మంత్రి ఆదేశానుసారం ఎస్సారెస్పీ అధికారులు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రాజెక్టు నుంచి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. క్రమంగా ఆ నీటిని రెండు వేల క్యూసెక్కుల వరకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఇక కడెం ప్రాజెక్టు నుంచి సైతం శనివారం నీటిని వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. ఇక్కడ సైతం తొలి దశలో 500 క్యూసెక్కుల నీటిని వదిలి తర్వాత పరిస్థితిని బట్టి నీటిని విడుదల చేయనున్నారు.
 
నీటి విడుదలపై సీఎం విన్నపం
ఎగువన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నాలుగైదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్ ఆర్.విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ ద్వారా విన్నవించినట్లు తెలుస్తోంది. బాసర వరకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై మంత్రి హరీశ్ సైతం ఆ రాష్ట్ర గవర్నర్, ఇతర అధికారులతో మాట్లాడినట్లుగా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement