సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుంభమేళా తరహాలో నిర్వహించ తలపెట్టిన గోదావరి పుష్కరాలకు ఎగువ గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీళ్లొస్తాయన్న ఆశలకు గండి పడింది. గైక్వాడ్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీకి చేరడంతో రాష్ట్రం కోరినట్లుగా నీటిని ఇచ్చేందుకు మహారాష్ట్ర విముఖత చూపింది. ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని ఔరంగాబాద్ పట్టణ తాగునీటి అవసరాలను తీర్చేందుకే వినియోగించాల్సి ఉన్న దృష్ట్యా మహారాష్ట్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ప్రాథమిక సమాచారం అందినట్లుగా తెలిసింది.
గోదావరి బేసిన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి దృష్ట్యా ఎగువ నుంచి సుమారు నాలుగైదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మహారాష్ట్రకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. గైక్వాడ్ ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 102 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 27 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు సైతం డెడ్‌స్టోరేజీకి దగ్గరగా ఉంది. ఒకవేళ గే ట్లు తెరిచినా అందులోంచి వచ్చే ఒకటి, రెండు టీఎంసీల నీరు 400 కిలోమీటర్లు దాటి రావాలంటే కష్టమే. మధ్యలోనే నీరు ఇంకిపోయే అవకాశం ఉంది.
దీనికి తోడు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తాగు అవసరాలకు నీటిని నిల్వ చేయకుండా, పక్క రాష్ట్ర అవసరాలకు ఇవ్వడం మహారాష్ట్రకు ఇబ్బందిగా మారుతుంది. ఈ దృష్ట్యానే నీటిని ఇవ్వలేమని మహారాష్ట్ర సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం గైక్వాడ్ నీటిపై ఆశలు గల్లంతు కావడంతో ఎస్సారెస్పీపైన బాసర వరకు ఉన్న ఏడు ఘాట్లకు నీరు అందడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తిగా షవర్ల ద్వారానే నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఒక క్రమపద్ధతిలో కొంచెంకొంచెంగా నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ నీటి విడుదల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది.
‘గైక్వాడ్’ నీటి ఆశలు గల్లంతు!
Published Fri, Jul 10 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement