విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది పరవళ్లు
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవాహం తోవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి 6,99,548 క్యూసెక్కులు రాగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు 7,79,221 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,963 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేసి 7,76,258 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద కారణంగా లంక గ్రామాల్లో పత్తి, మిరప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల్లో నీరు నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎగువన పెరిగిన వరద
కృష్ణా బేసిన్‌లో ఎగువన వరద పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ నిండుకుండల్లా మారడంతో వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.63 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీనివల్ల గురువారం జూరాల ప్రాజెక్టులోకి వచ్చే వరద పెరగనుంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న 2.73 లక్షల క్యూసెక్కులకు.. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొండవాగులు వరద ఉధృతి తోడవడంతో శ్రీశైలంలోకి 3.47 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్‌లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది.
వంశధార ఉగ్రరూపం
ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధార ఉగ్రరూపం దాల్చింది. గొట్టా బ్యారేజీలోకి 42,980 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేసి 46,916 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాగా, గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,21,804 క్యూసెక్కుల చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment