సాక్షి, అమరావతి: కృష్ణా మిగులు జలాలపై హక్కులు పరీవాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) సాంకేతిక సలహా కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)–1, కేడబ్ల్యూడీటీ–2, సీడబ్ల్యూఎంఏ (కావేరీ జలాల నియంత్రణ సంస్థ), ఎన్‌డబ్ల్యూడీటీ (నర్మదా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)లు మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేయడాన్ని ఎత్తిచూపింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 కసరత్తు చేస్తోందని.. ఈ నేపథ్యంలో మిగులు జలాలపై నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని స్పష్టం చేసింది.
జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో పులిచింతలకు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని లెక్కలోకి తీసుకోకూడదని పునరుద్ఘాటించింది. ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న కృష్ణా మిగులు జలాలను ఆ రాష్ట్రాల కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు జనవరి 21న సీడబ్ల్యూసీ ఐఎంవో విభాగం కేంద్రం సాంకేతిక కమిటీని నియమించింది. ఇది మే 13న మొదటిసారిగా సమావేశమైంది. రెండో భేటీని నిర్వహించేందుకు కసరత్తు చేస్తోండటంతో కమిటీకి తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం నివేదిక పంపింది. ఆ నివేదికలో ముఖ్యాంశాలు..
మళ్లించకుంటే 178.35 టీఎంసీలు కడలిలోకే..
2019–20లో భారీ వరదతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసిన సందర్భంలో పులిచింతలకు ఎగువన ఆంధ్రప్రదేశ్ 141.76 టీఎంసీలు, తెలంగాణ 36.59 వెరసి 178.35 టీఎంసీలను మళ్లించాయి. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఏపీ, తెలంగాణలు 178.35 టీఎంసీలను మళ్లించకుంటే మొత్తం 978.35 టీఎంసీలు కడలిలో కలిసేవి. అందుకే ఆ నీటిని ఇరు రాష్ట్రాల కోటా కింద కలపకూడదు. పులిచింతలకు దిగువన భారీ వర్షాలతో వరద జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నప్పుడు వాటిని మిగులు జలాలుగా పరిగణించకూడదు. ఈ సమయంలో ఎగువన ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి.
కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే
Published Mon, Oct 12 2020 3:56 AM | Last Updated on Mon, Oct 12 2020 3:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment