= ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తాం
= ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
= ‘కృష్ణా’ జలాల వాటా విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం
= రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే లెసైన్‌స రద్దు
= సీఎం సిద్ధరామయ్య వెల్లడి
మాన్వి/రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. బుధవారం ఆయన మాన్విలోని కాకతీయ పాఠశాల మైదానంలో, దేవదుర్గ తాలూకా అరకెరలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో మాట్లాడారు. అంతకు ముందు ఆయన పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. సీఎం మాట్లాడుతూ ... కృష్ణా నదీ జలాల
సాగు నీటి ప్రాజెక్టులకు పెద్దపీట
వాటా విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సమర్థవంతమైన వాదనలు వినిపిస్తుందని, న్యాయ నిపుణులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా ఆయకట్టు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తోందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగినట్లుగా అవినీతి, అక్రమాల నియంత్రణకు చర్యలు చేపట్టి అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. 169 హామీలు ఇచ్చామని, 2013-14లో 60 హామీలు నెరవేర్చామన్నారు.
అధికారం చేపట్టిన వెంటనే కొత్త పథకాలకు శ్రీకారం చుడితే విపక్షాలు నానాయాగీ చేయడం తగదన్నారు. అన్నభాగ్య, క్షీరభాగ్య, యశస్విని పథకాలను ప్రారంభించామన్నారు. రేషన్ షాపులలో బీపీఎల్ కార్డుదారులకు 30 కేజీల కంటే తక్కువ బియ్యం ఇస్తే అలాంటి రేషన్ షాప్‌ల లెసైన్స్ రద్దు చేస్తామన్నారు. అన్న భాగ్య పథకానికి ఏటా రూ.4200 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి బీపీఎల్ కార్డులు అందించామన్నారు. కర్ణాటకను ఆకలి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు.
రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు గోధుమలు, జొన్నలు కూడా పంపిణీ చేస్తామన్నారు. 39 లక్షల మంది అంగన్‌వాడీ పిల్లలకు, 65 లక్షల మంది విద్యార్థులకు క్షీరభాగ్య పథకం కింద పాలను అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదలు, దళితులు, మైనార్టీలు తీసుకున్న రూ.1300 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. బీజేపీ హయాంలో యడ్యూరప్ప, సదానందగౌడ, జగదీష్ శెట్టర్‌లు ఇచ్చిన హామీలేవీ లేవన్నారు. నేడు బీజేపీలో ప్రతిఒక్కరూ నమో మంత్రాన్ని జపిస్తున్నారన్నారు.
గుజరాత్‌లోని సమస్యలను పరిష్కరించలేని నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఎలా అవుతారన్నారు. రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రభావం ఏమీ లేదన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం చెరుకు, వరి, కంది, మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలకు మద్దతు ధరలు ప్రకటించామన్నారు.
నగరాభివృద్ధికి రూ.70 కోట్లు : మంత్రి ఖమరుల్ ఇస్లాం
జిల్లాలోని నగరసభలు, పురసభలకు రూ.70 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఖమరుల్ ఇస్లాం పేర్కొన్నారు. నగరాల పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాయచూరుకు రూ.30 కోట్లు, సింధనూరు, మాన్వి, లింగసూగూరు, మస్కి, దేవదుర్గ, ముదుగల్‌లకు రూ.6 కోట్లు చొప్పున విడుదల చేశామన్నారు. మైనార్టీలకు ఇళ్ల నిర్మాణానికి లక్ష రూపాయల సబ్సిడీ అందిస్తున్నామని, అభివృద్ధి పథకాలకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు.
ఎన్‌ఆర్‌బీసీ కాలువపై సర్వే : మంత్రి ఎంబీ పాటిల్
నారాయణపుర కుడిగట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ)పై 125వ కి.మీ.నుంచి 168వ కి.మీ.వరకు సర్వే జరుపుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి ఎం.బీ.పాటిల్ పేర్కొన్నారు. అరకెర వద్ద 9ఏ కాలువ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. లింక్ కెనాల్ విషయంలో కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నందవాడగి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖలో ప్రతి ఏడాది రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు.
రోడ్ల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు : రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ.18 వేల కోట్లు కేటాయించామని రాష్ట్ర ప్రజా పనుల శాఖా మహదేవప్ప పేర్కొన్నారు. ఈ ఏడాది 8 వేల కి.మీ.మేర రోడ్ల నిర్మాణానికి తారు వేసే పనులను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభిస్తారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బాదర్లి హంపనగౌడ, ప్రతాప్‌గౌడ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బోసురాజు, పాపారెడ్డి, రాజారాయప్ప నాయక్, జెడ్పీ అధ్యక్షురాలు లలిత, డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాగు నీటిప్రాజెక్టులకు పెద్దపీట
Published Thu, Dec 26 2013 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement