సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుల ఉమ్మడి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ప్రాజెక్టుతో దిగువన ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలకు నష్టం జరగదని నిర్ధారించాలని కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కోరింది. ప్రధానంగా 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఖరారు చేసిన మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద 561 టీఎంసీల లభ్యతకు రక్షణ కల్పించాలని సూచించింది. ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో భాగంగా సీడబ్ల్యూసీ గతంలో డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు పంపించింది. బోర్డు ఏమందంటే..
ఏపీ, తెలంగాణ మధ్య సమ్మతి లేదు..
రాష్ట్రాలు, ప్రాజెక్టుల వారీగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో నీటి కేటాయింపులు జరపలేదు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన గోదావరి జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చివరకు ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల లభ్యత, ప్రాజెక్టుల ద్వారా వినియోగం లెక్కలపై సైతం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదు.
నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తేల్చాలి..
ఇప్పటికే ఉన్న, నిర్మాణంలోని, నిర్మాణం ప్రారంభం కాని తమ ప్రాజెక్టుల అవసరాలకు 776 టీఎంసీలు అవసరమని ఏపీ, 967 టీఎంసీలు అవసరమని తెలంగాణ చెబుతున్నాయి. అయితే గోదావరిలో 1,743 టీఎంసీల మేరకు నీటి లభ్యత లేదని ఆయా రాష్ట్రాలే అంగీకరిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ 2014 జనవరి 2న రాసిన లేఖ ప్రకారం 1,486.155 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని తెలంగాణ అంటోంది.
2004 నాటి వ్యాప్కోస్ నివేదిక ప్రకారం కేవలం 1,360 టీఎంసీల లభ్యతే ఉందని, అలాగే 70 టీఎంసీల ఊట నీళ్ల లభ్యత ఉందని ఏపీ పేర్కొంటోంది. అయితే ఊట నీళ్లను పరిగణనలోకి తీసుకోరాదని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పేర్కొంటోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా 2000–2020 మధ్యకాలంలో సగటున వరుసగా 72 టీఎంసీలు, 11 టీఎంసీలను వాడినట్టు తెలంగాణ పేర్కొంటోంది.
ఈ అంశాల నేపథ్యంలో గోదావరి బేసిన్, సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధ్యయనం జరగాలి. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా సీతారామ వద్ద గోదావరిలో 347.06 టీఎంసీల లభ్యత ఉందని ప్రాజెక్టు డీపీఆర్ పేర్కొంటోంది. దీనిపై అధ్యయనానంతరం సీడబ్ల్యూసీ నిర్ధారిత లెక్కలు పంపించాలి.
గోదావరి జలాలను కృష్ణాకు ఎలా తరలిస్తారు?
సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల ద్వారా 10.109 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి తరలించి నాగార్జునసాగర్, వైరా, పాలేరు ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించనున్నట్టు డీపీఆర్‌లో ప్రతిపాదించారు. అయితే తరలింపును సమర్థిస్తూ డీపీఆర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
‘సీతారామ’పై సందేహాలు.. కీలక ప్రశ్నలు లేవనెత్తిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు
Published Thu, May 4 2023 4:38 AM | Last Updated on Thu, May 4 2023 10:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment