ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరిగింది.
ఆల్మట్టికి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సాక్షి, హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టిలోకి సోమవారం 20,792 క్యూసెక్కులు, నారాయణపూర్‌లోకి 10 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని ఆల్మట్టి నుంచి దిగువ నారాయణపూర్‌కు 11వేల క్యూసెక్కులు వదులుతుండగా, నారాయణపూర్ నుంచి 10వేల క్యూసెక్కులు కాల్వలకు వదులుతున్నారు. అయితే ఎగువన ప్రాజెక్టులు పూర్తి నిల్వలతో ఉన్నప్పటికీ దిగువకు చుక్క నీరు వదలడంలేదు. దీంతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేవు.
స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు 2,546 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇందులో 1,950 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు. ఇక శ్రీశైలానికి 1,187 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉన్నా, సాగర్‌కు మాత్రం చుక్క నీరు కూడా రావడం లేదు. దీంతో ప్రాజెక్టు మట్టం 500 అడుగుల కనిష్టానికి పడిపోయింది. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి స్థిరంగా ప్రవాహాలు వస్తున్నాయి. ఎస్సారెస్పీకి 17,642 క్యూసెక్కులు, సింగూరుకి 7,093 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎల్లంపల్లిలోకి సైతం 8,410 క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి.