
పాతాళంలో గంగమ్మ!
11 జిల్లాల్లో పడిపోయిన జలమట్టం.. గత మే కంటే దిగజారిన నీటి జాడ
- ప్రమాద ఘంటికలంటున్న నిపుణులు..
- రాయలసీమలో పరిస్థితి మరీ దారుణం
- నోళ్లు తెరుచుకున్న జలాశయాలు
- ఆగస్టు వరకూ తాగునీటికి కటకటే
వరుణుడి కటాక్షం కరువైంది.. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది.. బోర్లు, బావులు వట్టిపోయాయి.. నోళ్లిచ్చుకున్న జలాశయాలు, చెరువులు కలవరపెడుతున్నాయి.. నీటి జాడ కోసం పశుపక్షాదులూ వెంపర్లాడు తుంటే, ‘నీళ్లో రామచంద్రా..’ అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. వర్షాభావంతో జలాశయాలు, బావులు, బోర్లలో నీరు అడుగంటింది. గత ఏడాది మే నెల కంటే ఎక్కువగా ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారంలోనే భూగర్భ జల మట్టం కిందకు దిగజారడం ప్రమాదకర సంకేతం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున గత మే నెల కంటే 7.18 అడుగుల మేర కిందకు పడిపోయింది. కోస్తా జిల్లాల్లో సగటున 3.08 అడుగులు, రాయలసీమ జిల్లాల్లో 16.58 అడుగుల మేరకు జలమట్టం పడిపోవడం ఆందోళన కలిగి స్తోంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో మినహా రాష్ట్రమంతటా పరిస్థితి ఆందోళనరంగా ఉందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
28 శాతం లోటు వర్షపాతం
రాష్ట్రంలో గత ఏడాది జూన్ ఒకటితో ఆరంభమైన నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు 28.10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఏప్రిల్ 5వ తేదీ నాటికి 882 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 635 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 1,60, 200 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాష్ట్రంలో సగటున ఒక అడుగు నీటి మట్టం పెరగాలంటే చాలా వర్షం కురవాలి. అలాంటిది సగటున 7.18 అడుగులు, సీమలో 16.58 అడుగుల మేరకు నీటి మట్టం పైకి ఉబికి రావాలంటే అయిదారు భారీ వర్షాలు కురవాలి. గతేడాది వేసవిలో 4 వేలకు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది.
ఈ ఏడాది అంతకంటే పరిస్థితి విషమంగానే ఉండవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం, భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు. గడిచిన రెండేళ్ల వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాది భూగర్భ జలమట్టంపై పడింది. గత రెండేళ్లు కరువు నెలకొనడం వల్ల ఈ ఏడాది కొంచెం అటు ఇటుగా సాధారణ వర్షపాతం నమోదైనా నీటి మట్టం పైకి రాలేదు. ‘వరుస కరువుల తర్వాత భూగర్భ జలమట్టం పైకి రావాలంటే భారీ వర్షాలు ఎక్కువసార్లు కురవాల్సి ఉంటుంది. వాగులు, వంకలు భారీగా ప్రవహించాలి. నాలుగైదు రోజులపాటు జడివాన కురిస్తేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల శాఖకు చెందిన ఒక అధికారి ‘సాక్షి’కి వివరించారు.
జలాశయాలు ఖాళీ
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాలన్నింటిలోనూ నీటిమట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కృష్ణా బేసిన్‌లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులు. కానీ.. ఇప్పటికే భారీగా నీటిని తోడేయడంతో ప్రస్తుతం 806.3 అడుగుల్లో 32.24 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో 508.3 అడుగుల్లో 128.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. పులిచింతల్లో కేవలం 0.28 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
తుంగభద్ర జలాశయం లోనూ నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి.కేవలం 3.78 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. పెన్నార్ బేసిన్‌లో రిజర్వాయర్లదీ అదే పరిస్థితి. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్‌లలో నూ అంతే. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పడిపోవడంతో రాయలసీమకు నీళ్లందిం చడానికి వీలు కాని స్థితి నెలకొంది. సాగు, తాగునీటి బోరులు సైతం ఎండిపోయాయి. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు ఇప్పటికే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కర్నూలు నగరానికి తాగునీటిని అందించే సుంకేసుల జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో సమస్య తీవ్రతర మవనుంది. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయక పోవడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇబ్బందులు నెలకొన్నాయి. కృష్ణా బేసిన్‌లో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలో 12.85 టీఎంసీలు, నారాయణపూర్ జలాశయంలో 16.43 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో మహారాష్ట్రలో జైక్వాడ్ జలాశయంలో నిల్వ ఉన్న జలాలు 57.53 టీఎంసీలే.వర్షాలు కురిసి, ఎగువ రాష్ట్రాల్లోని జలాశయాలు పూర్తి స్థాయిలో నిండితే గానీ దిగువకు నీటిని విడుదల చేయరు. వరుణుడు కరుణిస్తేనే తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు జూలై ఆఖరుకు వరద నీరు చేరనుంది.