Underground water level
-
కేరళలో నదులెండిపోతున్నాయి..!
తిరువనంతపురం: ఇటీవల సంభవించిన భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోయి బావులు ఎండిపోయాయి. నేలను గుళ్లబారేలా చేసి రైతన్నలకు సాయపడే వానపాముల జాడే లేకుండా పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు. నీటిమట్టం తగ్గిపోవడంపై రాష్ట్ర జనవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్‌లు అధ్యయనం చేస్తాయని విజయన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 491 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
జూన్‌లో వర్షాలకు బోర్లు పూర్తిగా రీచార్జ్!
కందకాలు తవ్వించడం వల్ల ఈ ఏడాది జూన్‌లో కురిసిన 4, 5 వర్షాలకు భూగర్భ నీటి మట్టం బాగా పెరిగిందని, మూడు బోర్లూ పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని చింతా నరసింహరాజు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అర్మాయిపేట గ్రామ పరిధిలో ఆయనకున్న 27 ఎకరాల నల్లరేగడి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2017 నవంబర్‌లో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. మూడు బోర్లుంటే.. ఒక బోరే ఒక మోస్తరుగా పోసేది. మిగతా రెండు దాదాపు ఎండిపోయాయి. నాలుగు రోజులకోసారి పది నిమిషాలు నీరొచ్చే దుస్థితిలో ఉండేవి. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాల ద్వారా ‘చేనుకిందే చెరువు’ సాధించుకోవచ్చంటూ నిర్వహిస్తున్న ప్రచారోద్యమం గురించి మిత్రుడు క్రాంతి ద్వారా రాజు తెలుసుకున్నారు. పొలం అంతటా 50 మీటర్లకు వాలుకు అడ్డంగా ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తీసుకుంటే.. ఎంతటి కరువు ప్రాంత మెట్ట పొలాల్లో అయినా సాగు నీటి కొరత ఉండదని తెలుసుకున్నారు. కందకాలు తవ్వడానికి ఖర్చు అవుతుంది కదా అని తొలుత సందేహించినా.. నీరు లేకపోతే భూములుండీ ఉపయోగం లేదన్న గ్రహింపుతో కందకాలు తవ్వించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) సంగెం చంద్రమౌళి (98495 66009), సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి (94407 02029)లను తమ పొలానికి ఆహ్వానించి, వారి ఉచిత సాంకేతిక సహకారంతో కందకాలు తవ్వించామని రాజు తెలిపారు. నల్లరేగడి నేల కావడంతో కందకాలలో అంత త్వరగా నీరు ఇంకదు. కందకాలు నిండగా పొంగిపొర్లి వెళ్లిపోయే నీటిని కూడా ఒడిసిపట్టుకోవడానికి మట్టికట్టతో కూడిన ఫాం పాండ్‌ను కూడా తవ్వించారు. కందకాలు, ఫాం పాండ్ తవ్వడానికి రూ. 2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత కురిసిన వర్షాలతోపాటు ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు 4, 5 సార్లు కందకాలు పూర్తిగా నిండాయి. జూలైలో వర్షం పడలేదు. ఆగస్టులో వర్షాలకు రెండు, మూడు సార్లు కందకాలు నిండాయి. దీంతో భూగర్భ నీటి మట్టం బాగా పెరిగి, మూడు బోర్లూ పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఫాం పాండ్ దగ్గరలో ఉన్న బోరు పూర్తి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నదని రాజు ‘సాగుబడి’కి వివరించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కందులు (అంతరపంటలుగా మినుము, పెసలు, కొర్రలు), 5 ఎకరాల్లో తెలంగాణ సన్నాలు వరి పంట వేసినట్లు తెలిపారు. కొంత ఖర్చు అయినప్పటికీ, కందకాల ప్రభావం అద్భుతంగా ఉందని నరసింహరాజు (90084 12947) ఆనందంగా తెలిపారు. నీటి భద్రత రావటంతో పంటలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే రైతులు కందకాల ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు. -
కందకాలతో తోట పచ్చన
పుస్కూరు రఘుకుమార్, పీతా రవివర్మ అనే ఇద్దరు మిత్రులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాల, ఆగిర్యాల గ్రామాల పరిధిలో 50 ఎకరాలలో మామిడి తోటను పదేళ్లుగా సాగు చేస్తున్నారు. వర్షాలు అంతంతమాత్రంగా కురవడం, కురిసిన వర్షం కూడా భూగర్భంలోకి ఇంకే మార్గం లేకపోవడం వల్ల భూగర్భ జలమట్టం మరీ తగ్గిపోయింది. దీంతో తోటలో 5 బోర్లు ఉన్నప్పటికీ ఏ బోరూ సరిగ్గా నీరు పోయకపోవడం సమస్యగా మారింది. పదేళ్ల తోటను కాపాడుకోవడానికి వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించుకోవడమే ఉత్తమ పరిష్కార మార్గమని భావించిన రఘు, రవి.. గత ఏడాది తొలుత ఫాం పాండ్ తవ్వించుకున్నారు. ఆ క్రమంలోనే పొలంలో కందకాలు తవ్వడం మంచిదని తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలను సంప్రదించారు. వీరి కోరిక మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి దామోదర్‌రెడ్డి గత ఏడాది మే నెలలో స్వయంగా వచ్చి తోటలో భూమి స్థితిగతులను పరిశీలించి, వాలుకు అడ్డంగా మీటరు లోతున, మీటరు వెడల్పున, 20 మీటర్ల పొడవున కందకాలు తవ్వించారు. అదే వరుసలో 5 మీటర్లు ఖాళీ వదిలి మరో 20 మీటర్ల చొప్పున కందకాలు తవ్వించామని రవివర్మ తెలిపారు. కందకాలు తవ్విన తర్వాత కురిసిన వర్షాలకు రెండు సార్లు కందకాలు నీటితో నిండాయి. వర్షపు నీరంతా బయటకు కొట్టుకుపోకుండా పూర్తిగా భూమి లోపలికి ఇంకింది. ఈ కందకాల పుణ్యానే తమ మామిడి తోట పెరుగుదల, కాపు ఈ ఏడాది బాగుందని.. ఇంత మండు వేసవిలో కూడా పచ్చగా ఉందని రవివర్మ సంతృప్తిగా చెప్పారు. ఆ ప్రాంతంలో ఇతర తోటల్లో బోర్లు ఈ ఏడాది ఆగి ఆగి పోస్తుంటే.. తమ తోటలో బోర్లు మాత్రమే పుష్కలంగా పోస్తున్నాయన్నారు. రెండు బోర్లలో రెండున్నర ఇంచుల నీరు, మూడు బోర్లలో ఒకటిన్నర ఇంచుల బోర్లు కంటిన్యూగా పోస్తుండటానికి కారణం నిస్సంకోచంగా కందకాలేనని రవి వర్మ అన్నారు. రైతులు కందకాలు తవ్వుకుని పంటలను కాపాడుకోవచ్చని రఘు, రవివర్మ (80089 66677) ల అనుభవాలు చాటిచెబుతున్నాయి. పుస్కూరు రఘుకుమార్ -
పాతాళంలో గంగమ్మ!
-
పాతాళంలో గంగమ్మ!
11 జిల్లాల్లో పడిపోయిన జలమట్టం.. గత మే కంటే దిగజారిన నీటి జాడ - ప్రమాద ఘంటికలంటున్న నిపుణులు.. - రాయలసీమలో పరిస్థితి మరీ దారుణం - నోళ్లు తెరుచుకున్న జలాశయాలు - ఆగస్టు వరకూ తాగునీటికి కటకటే వరుణుడి కటాక్షం కరువైంది.. పాతాళ గంగమ్మ పైకి రానంటోంది.. బోర్లు, బావులు వట్టిపోయాయి.. నోళ్లిచ్చుకున్న జలాశయాలు, చెరువులు కలవరపెడుతున్నాయి.. నీటి జాడ కోసం పశుపక్షాదులూ వెంపర్లాడు తుంటే, ‘నీళ్లో రామచంద్రా..’ అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోతోంది. వర్షాభావంతో జలాశయాలు, బావులు, బోర్లలో నీరు అడుగంటింది. గత ఏడాది మే నెల కంటే ఎక్కువగా ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారంలోనే భూగర్భ జల మట్టం కిందకు దిగజారడం ప్రమాదకర సంకేతం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున గత మే నెల కంటే 7.18 అడుగుల మేర కిందకు పడిపోయింది. కోస్తా జిల్లాల్లో సగటున 3.08 అడుగులు, రాయలసీమ జిల్లాల్లో 16.58 అడుగుల మేరకు జలమట్టం పడిపోవడం ఆందోళన కలిగి స్తోంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో మినహా రాష్ట్రమంతటా పరిస్థితి ఆందోళనరంగా ఉందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 28 శాతం లోటు వర్షపాతం రాష్ట్రంలో గత ఏడాది జూన్ ఒకటితో ఆరంభమైన నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు 28.10 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఏప్రిల్ 5వ తేదీ నాటికి 882 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 635 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 1,60, 200 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రాష్ట్రంలో సగటున ఒక అడుగు నీటి మట్టం పెరగాలంటే చాలా వర్షం కురవాలి. అలాంటిది సగటున 7.18 అడుగులు, సీమలో 16.58 అడుగుల మేరకు నీటి మట్టం పైకి ఉబికి రావాలంటే అయిదారు భారీ వర్షాలు కురవాలి. గతేడాది వేసవిలో 4 వేలకు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ ఏడాది అంతకంటే పరిస్థితి విషమంగానే ఉండవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం, భూగర్భ జల శాఖ అధికారులు తెలిపారు. గడిచిన రెండేళ్ల వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఈ ఏడాది భూగర్భ జలమట్టంపై పడింది. గత రెండేళ్లు కరువు నెలకొనడం వల్ల ఈ ఏడాది కొంచెం అటు ఇటుగా సాధారణ వర్షపాతం నమోదైనా నీటి మట్టం పైకి రాలేదు. ‘వరుస కరువుల తర్వాత భూగర్భ జలమట్టం పైకి రావాలంటే భారీ వర్షాలు ఎక్కువసార్లు కురవాల్సి ఉంటుంది. వాగులు, వంకలు భారీగా ప్రవహించాలి. నాలుగైదు రోజులపాటు జడివాన కురిస్తేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల శాఖకు చెందిన ఒక అధికారి ‘సాక్షి’కి వివరించారు. జలాశయాలు ఖాళీ తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాలన్నింటిలోనూ నీటిమట్టం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల్లో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులు. కానీ.. ఇప్పటికే భారీగా నీటిని తోడేయడంతో ప్రస్తుతం 806.3 అడుగుల్లో 32.24 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో 508.3 అడుగుల్లో 128.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. పులిచింతల్లో కేవలం 0.28 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. తుంగభద్ర జలాశయం లోనూ నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి.కేవలం 3.78 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. పెన్నార్ బేసిన్లో రిజర్వాయర్లదీ అదే పరిస్థితి. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్‌లలో నూ అంతే. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పడిపోవడంతో రాయలసీమకు నీళ్లందిం చడానికి వీలు కాని స్థితి నెలకొంది. సాగు, తాగునీటి బోరులు సైతం ఎండిపోయాయి. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు ఇప్పటికే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు నగరానికి తాగునీటిని అందించే సుంకేసుల జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో సమస్య తీవ్రతర మవనుంది. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయక పోవడంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇబ్బందులు నెలకొన్నాయి. కృష్ణా బేసిన్లో కర్ణాటకలోని ఆలమట్టి డ్యాంలో 12.85 టీఎంసీలు, నారాయణపూర్ జలాశయంలో 16.43 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గోదావరి బేసిన్లో మహారాష్ట్రలో జైక్వాడ్ జలాశయంలో నిల్వ ఉన్న జలాలు 57.53 టీఎంసీలే.వర్షాలు కురిసి, ఎగువ రాష్ట్రాల్లోని జలాశయాలు పూర్తి స్థాయిలో నిండితే గానీ దిగువకు నీటిని విడుదల చేయరు. వరుణుడు కరుణిస్తేనే తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు జూలై ఆఖరుకు వరద నీరు చేరనుంది. -
అకాల వర్షం..అపార నష్టం
ఆరుగాలం శ్రమించి రేపోమాపో ఫలితం చేతికందుతున్న తరుణంలో ఊహించని విధంగా వచ్చిన వడగండ్లతో కూడిన అకాలవర్షంతో వరి పంట కళ్లముందే పాడవడంతో అన్నదాతల వేదన వర్ణనాతీతంగా మారింది. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో వరితోపాటు వందల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. ఉదయగిరి: అసలే కరువుతో సాధారణ విస్తీర్ణంలో మూడోవంతు కూడా ఈ ఏడాది రబీలో పైర్లు సాగు చేయలేదు. సాగుచేసిన పైర్లు కూడా భూగర్భ జలమట్టం అడుగంటి చాలా మేరకు ఎండుముఖం పట్టాయి. ఈ క్రమంలో రైతులు భగీరథ ప్రయత్నం చేసి కాపాడుకున్న పైర్లు మొత్తం అరగంట వ్యవధిలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఏడాది శ్రమ, పెట్టుబడి కళ్ల ముందే చెదిరిపోవడంతో దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో సుమారు 400 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో బత్తాయి, 100 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో బొప్పాయితోపాటు మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.4 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. వరికుంటపాడు మండలంలో గణేశ్వరపురం, నారసింహాపురం, తూర్పురొంపిదొడ్ల గ్రామాల్లో రెండు మూడు రోజుల్లో కోతకోసే 1010రకం వరిపైరు వడగండ్లు, గాలులతో పూర్తిగా దెబ్బతింది. సుమారు 50 ఎకరాల్లో పూర్తిగా పంట దెబ్బతిన్నదని, రూ.కోటి మేర నష్టం సంభవించినట్లు వ్యవసాయా«ధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా మొక్కజొన్న, బత్తాయి, మినుము, మిరప తదతర పంటలకు కూడా నష్టం వాటిల్లింది. వింజమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లి, జనార్దనపురం, గోళ్లవారిపల్లి, ఊటుకూరు, వింజమూరు, తమిదపాడు, కాటేపల్లి తదితర ప్రాంతాల్లో వరి, బత్తాయి, బొప్పాయి, మిరప, అరటి, తమలపాకు, మొక్కజొన్న తదితర పైర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొండాపురం మండలంలోని గరిమనపెంట, చల్లవారిపల్లి ప్రాంతాల్లో కూడా పంటలకు నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు అసలే కరువుతో అప్పులు తెచ్చి పైర్లు సాగు చేయగా నోటికి వచ్చే సమయంలో ఊహించని విధంగా వచ్చిన వర్షం బతుకులు అతలాకుతలం అవడంతో ప్రభుత్వ సాయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చొరవ తీసుకుని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం మంజూరు చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వడ్లన్నీ నేలపాలు భూమి కౌలుకు తీసుకుని వరిసాగు చేశాను. కోత కూడా కోశాం. ఇంతలో వడగండ్ల వాన కురవడంతో వడ్లన్నీ తడిసి పోయాయి. మొత్తం కష్టం, పెట్టుబడి నేలపాలైంది. – సయ్యద్ ఆశా, బత్తినవారిపల్లి, వింజమూరు రూ.20 లక్షలు నష్టపోయా బొప్పాయి, నిమ్మ, బత్తాయి తోటలను సాగు చేస్తూ ఇప్పటికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో నెలరోజుల్లో బత్తాయి కాపునకు వస్తుం ది. అకాల వర్షానికి బొప్పాయి తోట పూర్తిగా దెబ్బతింది. సుమారు రూ.20 లక్షల పంట నష్టపోయాను. –గడ్డం రమణారెడ్డి,మాజీ సర్పంచ్, చాకలికొండ, వింజమూరు