అకాల వర్షం..అపార నష్టం
ఆరుగాలం శ్రమించి రేపోమాపో ఫలితం చేతికందుతున్న తరుణంలో ఊహించని విధంగా వచ్చిన వడగండ్లతో కూడిన అకాలవర్షంతో వరి పంట కళ్లముందే పాడవడంతో అన్నదాతల వేదన వర్ణనాతీతంగా మారింది. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో వరితోపాటు వందల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు.
ఉదయగిరి: అసలే కరువుతో సాధారణ విస్తీర్ణంలో మూడోవంతు కూడా ఈ ఏడాది రబీలో పైర్లు సాగు చేయలేదు. సాగుచేసిన పైర్లు కూడా భూగర్భ జలమట్టం అడుగంటి చాలా మేరకు ఎండుముఖం పట్టాయి. ఈ క్రమంలో రైతులు భగీరథ ప్రయత్నం చేసి కాపాడుకున్న పైర్లు మొత్తం అరగంట వ్యవధిలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఏడాది శ్రమ, పెట్టుబడి కళ్ల ముందే చెదిరిపోవడంతో దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో సుమారు 400 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో బత్తాయి, 100 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో బొప్పాయితోపాటు మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.4 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా.
వరికుంటపాడు మండలంలో గణేశ్వరపురం, నారసింహాపురం, తూర్పురొంపిదొడ్ల గ్రామాల్లో రెండు మూడు రోజుల్లో కోతకోసే 1010రకం వరిపైరు వడగండ్లు, గాలులతో పూర్తిగా దెబ్బతింది. సుమారు 50 ఎకరాల్లో పూర్తిగా పంట దెబ్బతిన్నదని, రూ.కోటి మేర నష్టం సంభవించినట్లు వ్యవసాయా«ధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా మొక్కజొన్న, బత్తాయి, మినుము, మిరప తదతర పంటలకు కూడా నష్టం వాటిల్లింది. వింజమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లి, జనార్దనపురం, గోళ్లవారిపల్లి, ఊటుకూరు, వింజమూరు, తమిదపాడు, కాటేపల్లి తదితర ప్రాంతాల్లో వరి, బత్తాయి, బొప్పాయి, మిరప, అరటి, తమలపాకు, మొక్కజొన్న తదితర పైర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కొండాపురం మండలంలోని గరిమనపెంట, చల్లవారిపల్లి ప్రాంతాల్లో కూడా పంటలకు నష్టం జరిగింది.
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
అసలే కరువుతో అప్పులు తెచ్చి పైర్లు సాగు చేయగా నోటికి వచ్చే సమయంలో ఊహించని విధంగా వచ్చిన వర్షం బతుకులు అతలాకుతలం అవడంతో ప్రభుత్వ సాయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చొరవ తీసుకుని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం మంజూరు చేయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వడ్లన్నీ నేలపాలు
భూమి కౌలుకు తీసుకుని వరిసాగు చేశాను. కోత కూడా కోశాం. ఇంతలో వడగండ్ల వాన కురవడంతో వడ్లన్నీ తడిసి పోయాయి. మొత్తం కష్టం, పెట్టుబడి నేలపాలైంది.
– సయ్యద్ ఆశా, బత్తినవారిపల్లి, వింజమూరు
రూ.20 లక్షలు నష్టపోయా
బొప్పాయి, నిమ్మ, బత్తాయి తోటలను సాగు చేస్తూ ఇప్పటికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో నెలరోజుల్లో బత్తాయి కాపునకు వస్తుం ది. అకాల వర్షానికి బొప్పాయి తోట పూర్తిగా దెబ్బతింది. సుమారు రూ.20 లక్షల పంట నష్టపోయాను.
–గడ్డం రమణారెడ్డి,మాజీ సర్పంచ్, చాకలికొండ, వింజమూరు