
జూరాలపైనా సంయుక్త పర్యవేక్షణ
కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగాన్ని పర్యవేక్షించేం దుకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వద్ద
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగాన్ని పర్యవేక్షించేం దుకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వద్ద సంయుక్త పరిశీలన మొదలుపెట్టిన కృష్ణాబోర్డు, జూరాల ప్రాజెక్టుకు కూడా దీన్ని విస్తరించాలని నిర్ణయించింది. జూరాలపై ఆధారపడి తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులకు ఇక్కడి నుంచి ఇష్టారీతిన నీటిని తరలిస్తున్నారన్న ఏపీ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది.
ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కృష్టా బోర్డు లేఖలు రాయడంతోపాటు, ఆరు పాయింట్ల వద్ద నీటి ప్రవాహాన్ని లెక్కించేందుకు ఇంజనీర్ల పేర్లను సూచించాలని కోరినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై సంయక్త పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కృష్ణా బోర్డు స్పందించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శ్రీశైలం డ్యామ్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి పంప్‌హౌజ్‌ల వద్ద, సాగర్ డ్యామ్ కుడి, ఎడమ కాల్వ, ఏఎంఆర్‌పీ వద్ద ఇరు రాష్ట్రాలు ఎనిమిదేసి మంది ఇంజనీర్లను సూచించగా సంయుక్త పర్యవేక్షణ కొనసాగుతోంది.
అయితే జూరాల వద్ద మాత్రం పర్యవేక్షణ లేదు. జూరాల నీటిని వినియోగిస్తూ భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడుల ద్వారా లెక్కల్లో చూపకుండా తెలంగాణ నీటిని తరలిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 6 మంది ఇంజనీర్లతో సంయుక్త పర్యవేక్షణ ఉండాలని పట్టుబడుతోంది.