సాక్షి, అమరావతి: నీటి సంవత్సరం ప్రారంభమైన 6 రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్‌లోకి 4 టీఎంసీలు చేరాయి. ఆల్మట్టిలోకి 1.1, తుంగభద్ర డ్యామ్‌లోకి 2.2 టీఎంసీలు చేరాయి. ఎన్నడూ లేని రీతిలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలో అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి.
ఈ నెల మూడు, నాలుగో వారాల్లో కృష్ణా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలానికి కృష్ణమ్మ ముందుగానే చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నీ మంచి శకునములే కనిపిస్తుండటంతో కృష్ణా బేసిన్‌లో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నీటి సంవత్సరం ముగిసే నాటికి అధిక నీటి నిల్వ
కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లో సోమవారం నాటికి 129.72 టీఎంసీలకు గాను 48.9 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్‌లో 37.64 టీఎంసీలకు గాను 30.49 టీఎంసీలు ఉన్నాయి. ఈ రెండు డ్యామ్‌లు నిండటానికి 87.97 టీఎంసీలు అవసరం. తుంగభద్ర డ్యామ్‌లో 100.86 టీఎంసీలకు గాను 39.48 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
ఈ డ్యామ్ నిండటానికి 61.38 టీఎంసీలు అవసరం. గతేడాది కృష్ణా బేసిన్‌లో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల దాదాపు 8 నెలలపాటు ప్రవాహం కొనసాగడంతో సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోగా నీటి సంవత్సరం ముగిసే నాటికి (జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమై మే 31తో ముగుస్తుంది) ఆల్మట్టి, నారాయణపూర్ తుంగభద్ర డ్యామ్‌లలో అధికంగా నీటి నిల్వ ఉండటం ఇదే ప్రథమం.
ప్రారంభంలోనే వరద ప్రవాహం
నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కృష్ణా బేసిన్‌లో ఎగువన జూన్ 1 నుంచి 3 వరకూ వర్షాలు కురిశాయి. దాంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆరు రోజుల్లోనే ఆల్మట్టిలోకి 1.1 టీఎంసీలు చేరగా.. దానికి దిగువన ఉన్న నారాయణపూర్‌లోకి 4 టీఎంసీలు చేరాయి. తుంగభద్ర డ్యామ్‌లోకి 2.2 టీఎంసీలు చేరాయి.
కృష్ణా బేసిన్‌లో ఎగువన ప్రధానంగా పశ్చిమ కనుమల్లో ఈ నెల 3, 4 వారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు వర్షాలు కురిస్తే నెలాఖరు నాటికే ఆల్మట్టి, నారాయణపూర్ నిండే అవకాశం ఉంది.
అప్పుడు జూలై మొదటి లేదా రెండో వారం నాటికే శ్రీశైలానికి కృష్ణమ్మ చేరే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలై 17న ఎగువ నుంచి కృష్ణమ్మ శ్రీశైలానికి చేరగా.. ఈ ఏడాది అంతకంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment