సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ, ఏపీల ప్రాజెక్టులకు నీళ్లు కరువవుతుంటే.. మరోపక్క ఎగువన ఉన్న కర్ణాటక మాత్రం కృష్ణా నీటిని మరింత కట్టడి చేసేందుకు యత్నిస్తోంది. దిగువకు చుక్క నీటిని కూడా వదలకుండా తన స్వప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే వ్యూహాలకు పదును పెడుతోంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపి, అది అమల్లోకి రాకుండానే డ్యామ్ ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేలా పావులు కదుపుతోంది. దీనికి బలమిచ్చేలా ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నట్లు, దీనికోసం రూ.30,143 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కర్ణాటక భారీ నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
వాటాలు అధికారికం కాకముందే..
కృష్ణా జల వివాదాలపై తొలిసారిగా ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం డిపెండబిలిటీతో 2,130 టీఎంసీ నీటిలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీ, మహారాష్ట్రకు 585 టీఎంసీ, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుతం ఇదే వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీతో 2,578 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించి అందులో ఏపీకి 1,001, మహారాష్ట్రకు 666, కర్ణాటకు 911 టీఎంసీలు కేటాయించింది. ఈ తీర్పును వెలువరించిన సందర్భంగానే కర్ణాటకకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524.25 మీటర్ల ఎత్తు వరకు పెంచుకునే వీలు కల్పించింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్లు కాగా, 129 టీఎంసీల నిల్వ సామర్థ్యముండగా, మొత్తంగా 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. ఒకవేళ బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వచ్చి ఎత్తు పెరిగితే నిల్వ సామర్థ్యం 259 టీఎంసీలకు పెరుగుతుంది. నీటి వాడకం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరుగుతుంది. అదనంగా 130 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇప్పటివరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదు. అది అమలు కాకుండానే వాటాలు అధికారికం కాకుండా ఆల్మట్టి ఎత్తు పెంచుకునే వీలుండదు. అయినప్పటికీ ఎత్తు పెంచేలా కర్ణాటక తన కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఎన్నికల నుంచే తెరపైకి..
ఇటీవల కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆల్మట్టి ఎత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఎత్తు పెంచడంతోపాటు, పెంచితే అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకునేలా 9 ఎత్తిపోతలు చేపడతామని ప్రకటించాయి. ఈ మేరకు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ప్రకటన చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్‌లకు నీళ్లు వచ్చేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సి వస్తోంది. ఎత్తు పెంచాక అక్టోబర్ తర్వాతే నీళ్లొచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పరిస్థితి దారుణంగా మారుతుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో చేపట్టిన.. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు, వీటి పరిధిలోని 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం కష్టతరమే కానుంది. ఈ నేపథ్యంలో ఎత్తు పెంపుపై మళ్లీ న్యాయస్థానాల్లో పోరాటమే తెలుగు రాష్ట్రాలకు శరణ్యం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment