కృష్ణరాజ సాగర్ (కేఆర్‌ఎస్) డ్యాం నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేస్తున్నారనే విషయం మీద ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. కావేరీ నదీ జలాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు విడుదల చేయబోమని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
తమిళనాడుకు నీటి విడుదలను ప్రారంభించలేదు. ఒకవేళ నీటిని విడుదల చేయాలన్నా దాని గమ్యాన్ని చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని శివకుమార్ వెల్లడించారు. నీటి సంక్షోభం తీవ్రతరమవుతున్న సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేసేంత మూర్ఖత్వం ఈ ప్రభుత్వంలో లేదని అన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో కేఆర్‌ఎస్ డ్యాం నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం జిల్లా కేంద్రమైన మండ్య పట్టణంలో రైత హితరక్షణ సమితి నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రైతులు, పౌరుల ప్రయోజనాల కంటే తమిళనాడులో దాని కూటమి భాగస్వామి 'డీఎంకే'కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ బీజేపీ కూడా విమర్శించింది.
మలవల్లిలోని శివ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నింపేందుకు కేఆర్‌ఎస్ డ్యాం నుంచి కొంత నీటిని విడుదల చేశామని, అక్కడి నుంచి బెంగళూరుకు పంపింగ్ చేస్తామని శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేశామన్న వార్తలు పూర్తిగా ఆవాస్తవమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment