బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో.. గత మూడు-నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ సమయంలో తమిళనాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరీ నదీ జలాలను విడుదల చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇంతకుముందు నీటి కొరత కొంత మేర ఉన్నప్పటికీ.. ఇంత పెద్ద సంఖ్యలో తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా మేము ఎప్పుడూ ప్రకటించలేదని విలేకర్లతో జరిగిన సమావేశంలో శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులో 13900 బోర్‌వెల్‌లలో 6900 బోర్‌వెల్‌లు పనికిరాకుండా పోయాయని పేర్కొన్నారు.
బెంగళూరు అర్బన్ జిల్లాలోని 1,193 వార్డులతో పాటు కర్ణాటక వ్యాప్తంగా 7,082 గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కూడా తుమకూరు జిల్లా (746 గ్రామాలు) అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఇప్పటికే నీటి సరఫరా చేసేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేసిందని శివకుమార్ చెప్పారు.
నీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలోని కరువు పరిస్థితులను పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment