కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మే 5న భేటీ కానుంది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మే 5న భేటీ కానుంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ శుక్రవారం ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లి నీటిని పంపిణీ చేయాలన్న డిమాండ్‌లతో పాటు టెలీమెట్రీ పరికరాల అమరిక అంశాన్ని ప్రధాన ఎజెండాలో చేర్చారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌లో 503 అడుగులు, శ్రీశైలంలో 785 అడుగుల వరకు నీటిని తీసుకోవాల్సి ఉంది.
ఈ మట్టాల వద్ద ప్రస్తుతం 6.53 టీఎంసీల నీరు ఉండటం, ఆ నీరంతా ఏపీకే దక్కనుండటంతో తెలంగాణ తన అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల్లో మరింత దిగువకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతోంది. సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల మట్టం వరకు వెళ్లేందుకు అవకాశం ఇస్తే హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. 18 చోట్ల టెలీమెట్రీ పరికరాల అమర్చే ప్రక్రియ కొనసాగుండగా పోతి రెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వల వద్ద కొన్ని మార్పు లు అవసరం అవుతున్నాయి. వీటిపైనా బోర్డు ఇరు రాష్ట్రాల ఆమోదం కోరే అవకాశం ఉంది.