చెరువులతో ప్రాజెక్టుల చెలిమి! | Telangana Government Thinking All Ponds Attach To Projects | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 1:58 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Telangana Government Thinking All Ponds Attach To Projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, మరోవైపు చిన్న నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రణాళికకు పురుడు పోసింది. మిషన్‌ కాకతీయలో గుర్తించిన ప్రతి చెరువునూ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింది కాల్వలతో అనుసంధానం చేసి బీడు భూముల న్నింటికీ నీరు పారించే కార్యాచరణను రూపొందిం చింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు ముందే వీలైనన్ని ఎక్కువ చెరువులను ఈ విధానం ద్వారా నింపాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన 7,500 గొలుసుకట్టు చెరువులను నింపి మిగతా వాటికి గల అవకాశాలను ‘టోపోషీట్‌’ల ద్వారా అధ్యయనం చేయనుంది. 

గరిష్ట వినియోగం.. గరిష్ట ఆయకట్టు
నిజానికి చిన్న నీటివనరుల కింద భారీ నీటి కేటాయింపులు ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 165 టీఎంసీలు, కృష్ణాలో 89 టీఎంసీలు కలిపి మొత్తంగా 254 టీఎంసీల కేటాయింపులున్నా వినియోగం మాత్రం 100 నుంచి 130 టీఎంసీలకు మించడం లేదు. వీటి కింద 24.50 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా మిషన్‌ కాకతీయకు ముందువరకు 10 లక్షల ఎకరాల్లోపే సాగు జరిగేది. కాకతీయ ఆ తర్వాత అది 15 లక్షలకు చేరినా మరో 10 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది.

ఈ దృష్ట్యా మరింతగా నీటిని వినియోగించుకోవడంతో పాటు గరిష్ట ఆయకట్టుకి నీరు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే మిషన్‌ కాకతీయ కింద 44,928 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడతల్లో కలిపి 29 వేల చెరువుల పునరుద్ధరణకు అనుమతులొచ్చాయి. ఇందులో 20 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఈ డిసెంబర్‌ నాటికే మిగతా చెరువుల పనులు పూర్తి చేయనున్నారు. మిగిలిన వాటిని ఐదో విడతలో చేపట్టి వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయనున్నారు. 

ఖరీఫ్‌ను త్వరగా మొదలుపెట్టొచ్చని..
పునరుద్ధరించిన చెరువులను నిత్యం నీటితో నింపడంపై దృష్టి సారించిన సర్కారు.. భారీ, మధ్యతరహా, ఎత్తిపోతల పథకాలతో వాటిని అనుసంధానించాలని నిర్ణయించింది.  ఈ మేరకు నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖను ఇటీవల సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల కాల్వలు పారుతున్న ప్రాంతాలను టోఫోషీట్‌లపై మొదట గుర్తించాలని.. తర్వాత వాటికి దగ్గరలోని చెరువులను మార్కింగ్‌ చేసి కాల్వల ద్వారా నింపే అవకాశాలు పరిశీలించాలని సూచించారు.

మొత్తం ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు ద్వారా వాటిని నింపే అవకాశం ఉందో నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. చెరువుల్లో నీటి లభ్యత పెరిగితే జూన్‌లో వర్షాలకు ముందే చెరువు నీటితో నార్లు పూర్తవుతాయని, వర్షాలు కురిసే సమయానికి నాట్లకు వీలవుతుందని, తద్వారా ఖరీఫ్‌ను త్వరగా చేపట్టొచ్చని సీఎం భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 7,500 గొలుసుకట్టు చెరువులను గుర్తించామని, మిగతా వాటిని గొలుసుకట్టుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని నీటి పారుదల శాఖ వెల్లడించింది.

కరువును జయించవచ్చు: హరీశ్‌
రాష్ట్రంలోని చెరువులను, కుంటలను నీటితో నింపితే కరువు పరిస్థితులను పారదోలవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘చెరువుల్లో నీరు ఉండే ప్రాంతాల్లో సైక్లింగ్‌ విధానం వల్ల తిరిగి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు నీటితో నిండితే కరువును జయించడమే కాకుండా అకాల వర్షాలు, వడగండ్ల వానలను నివారించవచ్చు. పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. భూగర్భజలాలు పెరిగి ఫ్లోరైడ్‌ సమస్య తగ్గుతుంది. రాష్ట్రానికి పూర్థి స్థాయిలో నీటి భద్రత లభిస్తుంది’ అని హరీశ్‌రావు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement