మిషన్ కాకతీయ..
* చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్
* కృష్ణా, గోదావరి నదుల పరిధిలో నీటిని ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం
* మంత్రి హరీష్‌రావు, అధికారులతో కలసి సమీక్షించిన ముఖ్యమంత్రి
* డిసెంబర్ మూడోవారంలో చెరువు పనులు ప్రారంభించాలని ఆదేశం
* తనతోపాటు మంత్రులు కూడా శ్రమదానం చేస్తారని సీఎం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల పరిధిలో రాష్ట్రంలోని చిన్న నీటి వనరులకు ఉన్న కేటాయింపులను పూర్తిస్థాయిలో వాడుకునేందుకు వీలుగా చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ అనే పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీనికి ‘మన ఊరు-మన చెరువు’ అనే ట్యాగ్‌లైన్‌ను సైతం పెట్టారు. తెలంగాణలో వేలాది చెరువులు తవ్వి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేసిన కాకతీయులకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలని, వారిని స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని ప్రదర్శించడాన్ని బాధ్యతగా భావిస్తూ ‘మిషన్ కాకతీయ’ను ముందుకు తీసుకెళతామని కేసీఆర్ ప్రకటించారు.
పునరుద్ధరణ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, కాకతీయులు ఏ లక్ష్యాలతో చెరువులను తవ్విం చారో ఆ లక్ష్య సాధనకు ప్రతి పౌరుడూ పాటుపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. శనివారం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్ , ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
తాంబాళాల్లా మారాయి..
కాకతీయుల కాలంలో చెరువులు గంగాళాలుగా ఉండేవని, సీమాంధ్రుల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై తాంబాళాలుగా మారాయని కేసీఆర్ ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయ, రజక, మత్స్యకారులకు ఆసరాగా ఉండే అమ్మలాంటి చెరువులను కాపాడుకోవడం బిడ్డలుగా మన బాధ్యత అని తెలిపారు. చెరువులను రక్షించుకునేందుకు చెరువులపై ఆధారపడే అన్ని కులాల ప్రాతినిధ్యంతో గ్రామ సర్వవర్గ సమితిని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.
గోదావరి, కృష్ణా జలాలను ఒడిలో నింపుకొనేలా చెరువులు తయారు కావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం డిసెంబర్ మూడో వారంలో పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, మే చివరి నాటికి మొదటిదశ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయాలని సూచించారు. ఈ ఏడాది పనులు చేస్తూనే, వచ్చే ఏడాది పునరుద్ధరించాల్సిన చెరువులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యత చెప్పేందుకు తాను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా శ్రమదానం చేస్తామని, ఊరుఊరంతా పునరుద్ధరణను పండగలా నిర్వహించుకోవాలని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతలపై సమీక్ష
ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి పాలమూరు ఎత్తిపోతలపైనా సమీక్షించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాలను పరిశీలించారు. కృష్ణా నది నుంచి ఎన్ని క్యూసెక్కుల నీరు తీసుకోవాలి, అందుకు ఉపయోగించే పైపులు ఎలా ఉండాలి, జల విద్యుత్ ఎంత అవసరం అవుతుందన్న దానిపై ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
‘సాక్షి’ కథనంతో కదలిక
చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినా, నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడానికి చాలా అడ్డం కులు ఉన్నాయంటూ ఈ నెల 7న(శుక్రవా రం) ‘భగీరథ యత్నమే’ అంటూ ‘సాక్షి’లో వచ్చిన వార్తాకథనం ప్రభుత్వంలో కదలిక ను తెచ్చింది. పనులు నిర్ధారించక, కేటాయింపులు జరపకపోవడం, వారికి సామగ్రి అందకపోవడం, టెండర్ల ప్రక్రియ మొదలు కాకపోవడం తదితర అంశాలను పేర్కొం టూ రాసిన ఈ కథనంపై తక్షణమే స్పందిం చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పనుల జాప్యానికి గల కారణాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావును అదేరోజు ఆదేశించారు.
దీనిపై కదిలిన ఆయన శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 5 గంటలపాటు అధికారులతో సమీక్షించారు. పనుల నిర్ధారణ, టెండర్ల ప్రక్రియలో జాప్యం, అధికారుల కేటాయింపులపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. వారిచ్చిన సమగ్ర వివరాలపై శనివారం సీఎం సమీక్ష జరి పారు. పనుల్లో ఏమాత్రం జాప్యం జరగకుండా, నిర్ణీత సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు గట్టి ఆదేశాలిచ్చారు.