సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, హరీష్ రావు శనివారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పని చేశాం. కష్టల్లో నుంచి పాటలు వచ్చాయి. రైతుల వ్యతల్లో నుంచి పాటలు వచ్చాయి. నీళ్ల కోసం కూడా పాటలు వచ్చాయి. సదాశివుడు రాసిన పాట కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందింది. తలాపున పారుతుంది గోదారి.. చేను చెలక ఏడారి పాట తెలంగాణ నీళ్ల గోసను చూపెట్టింది.
తెలంగాణ వచ్చాక ఎర్రటి ఎండలో కూడా మత్తల్లు దూకిన చెరువులు కనిపించాయి. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం. కొంచెం బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు గోదావరి ఎండిపోయింది. పది పదిహేను రోజుల నుంచి గోదావరి నీళ్ళు వస్తున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయటం లేదు. కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వంపై నిందలు వేయటం కాదు, రైతుల కన్నీళ్ళు తుడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
మళ్లీ రాష్ట్రంలో కవులకు, కళాకారుల పెన్నులకు పదును పెట్టాల్సిన అవసరం వచ్చిందేమో. రోజు పేపర్లు చూడగానే రైతులు ఆత్మహత్యలు కనబడుతున్నాయి. కరెంట్ కోతలు మొదలయ్యాయి. అనేక సమస్యలు జనాన్ని వెంటాడుతున్నాయి. కళాకారులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని నాకు చెప్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతాం. సామాజిక బాధ్యతగా కళాకారులు పోరాడాలి. మళ్లీ మీ పెన్నులకు పదును పెట్టాలి’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment