జిల్లాలోని పలు చెరువులు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడం, గండ్లు పడినా పూడ్చకపోవడంతో కాలం అనుకూలించినా ఆయకట్టు పరిధిలో సాగు విస్తీర్ణం తగ్గుతోంది. నిధుల విడుదలలో గత ప్రభుత్వం జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే నూతన ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయడంతో ఇకనైనా వాటికి మహర్దశ పడుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
సాక్షి, ఖమ్మం : జిల్లాలో వర్షాలు తగినంతగా పడితే చెరువుల కింద వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. అయితే నిధుల లేమితో గత కొన్నేళ్లుగా చెరువు కట్టలు, గండ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో వర్షం పడి చెరువులు నిండితే లీకులు, గండ్లతో నీరంతా వృథాగా పోతోంది. ఫలితంగా చాలా చెరువుల కింద ఆయకట్టు తగ్గిపోయింది. అంతేకాక బయ్యారం, బేతంపుడి, కామేపల్లి, గార్ల పెద్దచెరువు, సుదిమళ్ల, సింగభూపాలెం, బేతుపల్లి, లంకాసాగర్, నేలకొండపల్లి లాంటి పెద్ద చెరువుల్లో ఇసుక మేట వేసింది.
ప్రధాన చెరువుల మరమ్మతుల కోసం ఏటా ఖరీఫ్ సీజన్ ముందే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వర్షాకాలం వచ్చేనాటికి పనులు పూర్తవుతాయి. కానీ కట్ట లు తెగినా, గండ్లు పడినా మరమ్మతులు చేపట్టడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చింది. దీంతో చెరువుల కింద ఒకప్పుడు వేల ఎకరాల్లో ఉన్న ఆయకట్టు ఇప్పుడు వందల ఎకరాలకు చేరింది. జిల్లాలో నీటి పారుదల శాఖ పరిధిలోని ఖమ్మం, పాల్వంచ, భధ్రాచలం డివిజన్లలో 399 పెద్ద చెరువులు, 2,097 చిన్నచెరువులు ఉన్నాయి. పెద్ద చెరువుల కింద 1,41,652 ఎకరాలు, చిన్న చెరువుల కింద 54,192 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే మరమ్మతులు లేక గత ఐదేళ్లలో ఈ విస్తీర్ణం బాగా తగ్గింది.
ఇకనైనా పూర్వ వైభవం వచ్చేనా..?
జిల్లాలో పెద్ద చెరువులన్నీ కాకతీయుల కాలంలో నిర్మించినవే. అప్పట్లో ఈ చెరువుల ఆధారంగానే రైతులు పంటలు పండించేవారు. అయితే ఈ చెరవులు ఇప్పుడు చాలా వరకు నాటి వైభవాన్ని కోల్పోయాయి. అప్పటి పరిజ్ఞానంతో కాకతీయులు చెరువులు నిర్మిస్తే.. ఇప్పుడు అధునాతన పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వాటికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇలాంటి చెరువులకు మహర్దశ పట్టించేందుకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.
జిల్లాల వారీగా ఆనవాళ్లు కోల్పోయిన, మరమ్మతులకు గురైన చెరువుల వివరాలు ఈనెల 30లోగా ప్రభుత్వానికి నివేదిక అందించాలి. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో చెరువులకు నిధులు విడుదల కానున్నాయి. కమిటీ ఆదేశాలు అందగానే జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి వివరాలు పంపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జిల్లాల వారిగా చెరువుల మరమ్మతులకు ఎంత ఖర్చు చేశారోననే వివరాలు కూడా ప్రభుత్వానికి అందజేయాల్సిన అవసరం ఉండడంతో సదరు అధికారులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
కృష్ణా.. గోదావరి నీటితో..
సాగర్ ఆయకట్టు పరిధిలో జిల్లాలో 16 మండలాల్లో ఇప్పటికే ఈ నీటితో చెరువులు నింపుతున్నారు. ఇల్లెం దు, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వర్షాధారంతో పాటు వాగులు, వంకలతో నిండుతున్న చెరువులున్నా యి. ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణలో భాగంగా కృష్ణా, గోదావరి నదులతో వీటిలో నీటిని నింపాలన్న యోచనలో ఉంది. జిల్లాలో ఇప్పటికే సాగర్ నీటితో చెరువులను నింపుతుండడంతో దీని పరిధిలో మరికొన్ని చెరువులకు నీరందించే అవకాశం ఉంది. ఇక రాజీవ్‌సాగర్(దుమ్ముగూడెం) ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండడం, టెయిల్‌పాండ్‌పై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో తమకు గోదావరి జలాలు ఎప్పుడు అందుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఈ నీటిని జిల్లాలో గోదావరి బేసీన్ సమీపంలో ఉన్న చెరువుల్లో నింపాలంటే ప్రధానంగా రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనిపై నూతన కమిటీ తీసుకునే నిర్ణయంపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని రైతులు అంటున్నారు. ప్రధానంగా చెరువుల పునరుద్దరణకే ప్రభుత్వం కమిటీ వేయడంతో జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు మినహాయిస్తే మిగతా మెట్ట ప్రాంత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇంజినీర్ల చెరువుబాట
ఖమ్మం అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులతో ఈనెల 22న నిర్వహించనున్న సమీక్షకు అవసరమైన నివేదికల తయారీలో ఆ శాఖ ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. జిల్లాలో డివిజన్‌ల వారీగా చెరువులెన్ని ఉన్నాయి.. ప్రస్తుతం ఆయకట్టు ఎంత.. అభివృ ద్ధి చేస్తే ఎంత ఆయకట్టు పెరుగుతుంది.. అనే వివరాల తో సమగ్ర నివేదికను తయారు చేస్తున్నారు.శుక్రవారం నుంచి అదివారం వరకు జిల్లాలోని 2,496 చెరువుల వి వరాలతో పాటు ఆయా మండలాల్లో ఉన్న చెక్ డ్యాంల వివరాలను కూడా తీసుకుని రావాలని, అవేకాకుండా ప్రైవేట్ కుంటలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన నివేదిక తేవాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇం జనీర్లు చెరువుల బాట పట్టారు. చిన్న, పెద్ద చెరువులు వేల సంఖ్యలో ఉంటే ప్రతి చెరువు వద్దకు స్వయంగా వెళ్లి వివరాలు తీసుకోవాలని, ఆ చెరువు వద్ద నిలబడి దిగిన ఫొటోలను సైతం తేవాలని చెప్పడంతో మూడు రోజుల్లో ఈ మొత్తం పనులు ఎలా సాధ్యమని కొందరు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరుద్ధరణ పథకంలో నీటి నిల్వల కోసం ప్రభుత్వ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టడంతో, దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జేఈ నుంచి పైస్థాయి అధికారులంతా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది.
చెరువుల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు
Published Sat, Sep 20 2014 3:58 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement