భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
నేడు మరింత పెరగనున్న వరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం, ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉప నదులు వరదెత్తడంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చి0ది. బుధవారం సాయంత్రం 6 గంటకు భద్రాచలం వద్దకు 8.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 45.55 అడుగులకు చేరుకుంది. దాంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
బుధవారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉంది. అప్పుడు అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. పోలవరంలోకి ఎగువ నుంచి వల్చిన వరదను వల్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,02,506 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 7,00,706 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల్లోనూ గోదావరి పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వరద మరింత పెరగనుంది. గురువారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
48 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
గోదావరి పెరుగుతుండడంతో శబరి నది ఎగపోటుకు గురై చింతూరు మండలంలో వాగులు పొంగుతున్నాయి. దీంతో విలీన మండలాల్లో రహదారులు ముంపునకు గురై 48 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వీఆర్‌పురం మండలాల నడుమ, చింతూరు మండలంలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment