సుజలం.. నిల్వలో విఫలం
ఒకేసారి పొంగి ప్రవహించిన గోదావరి, కృష్ణా
నిల్వకు అవకాశం లేకపోవడంతో వరద అంతా సముద్రంలోకి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు ఒకేసారి ఉప్పొంగి ప్రవహించాయి. గోదావరిలో నిల్వకు అవకాశం లేకపోవడం, కృష్ణాలో పులిచింతల దిగువనే వర్షాలు కురవడంతో నిల్వ చేయడానికి ప్రాజెక్టులు లేకపోవడంతో.. భారీ ప్రవాహాలు సముద్రం పాలయ్యాయి. పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద 3 టీఎంసీలను నిల్వ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఫలితంగా కృష్ణలో భారీ ప్రవాహం వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. మంగళవారం ప్రకాశం బ్యారే జీ నుంచి 44,403 క్యూసెక్కుల నీటిని కిందకు విచిపెడుతున్నారు. గోదావరి కూడా పరవళ్లు తొక్కుతోంది. ఎగువన తెలంగాణలోని కడెం ప్రాజెక్టుకు మినహా మిగతా ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేదు.
ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా ఉపనదుల్లో ప్రవాహాలు నమోదవుతున్నాయి. గోదావరి దిగువన భారీ వర్షాలు కువడం, సీలేరు నుంచి వరద నీరు రావడంతో.. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 7.8 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. పులిచింతలకు 3,715 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ వద్ద 1,177 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కృష్ణా ఎగువన కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నా.. అక్కడ ప్రాజెక్టులు నిండితే తప్ప కిందకు విడిచిపెట్టరు. ఆల్మట్టికి 23,228 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నా.. ప్రాజెక్లు నిండకపోవడంతో కిందకు చుక్కనీరు కూడా విడిచిపెట్టడం లేదు.
2 రోజులు ఓ మోస్తరు వర్షాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పశ్చిమ బెంగాల్‌కే పరిమితమైంది. దానివల్ల ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దాంతో రానున్న రెండురోజుల్లో ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడ జల్లులుగానీ, ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి.