సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపుల్లో బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యమివ్వాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణాజలాల్లో మిగులు నీటిని బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులకే కేటాయించాలని కోరింది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల తాగు, సాగు అవసరాలను తీర్చేవిధంగా చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులకు 200 టీఎంసీల మేర నికర జలాలు కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌లో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో తెలంగాణ అవసరాలు, ప్రాజెక్టు పరిధిలో ఉన్న సాగు డిమాండ్, ఏపీకి అక్రమంగా జరిగిన కేటాయింపుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. తెలంగాణలో ప్రాజెక్టులు, తాగు, పారిశ్రామిక అవసరాలకు మొత్తం కలిపి 936.58 టీఎంసీల నీరు అవసరమని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ‘గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు పూర్తిస్థాయిలో ఖర్చుకావు, తిరిగి 80 శాతం వివిధ రూపాల్లో బేసిన్‌లోని జల వనరులకు చేరుతాయి. కావున నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా పేర్కొనాల’ని కోరింది.
ఇతర బేసిన్లకు నీటి తరలింపు..
కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహక ప్రాంతం తక్కువే అయినప్పటికీ, భారీ ఎత్తున కృష్ణాజలాలను ఏపీ వినియోగించుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. 397 టీఎంసీల కృష్ణాజలాలను పెన్నా, ఇతర బేసిన్లకు ఏపీ తరలిస్తున్నదని, శ్రీశైలం జలాశయం నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఇతర బేసిన్లకు ఈ నీటిని తరలిస్తున్నదని తెలిపింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణలోని 36.45 లక్షల హెక్టార్ల భూమి సాగు యోగ్యంగా ఉందని తెలిపింది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ కేటాయింపుల్లో సర్దుబాటు చేసిన 299 టీఎంసీల ద్వారా 5.75 లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగులోకొచ్చిందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా మరో 10.38 లక్షల హెక్టార్లు సాగులోకి రానుండగా, మరో 20.32 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి వసతి కల్పించాల్సి ఉందని తెలిపింది. ఈ దృష్ట్యా ఏపీ బేసిన్ ఆవలకు తరలిస్తున్న నీటి నుంచి 75 శాతం డిపెండబిలిటీపై ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎస్‌ఎల్‌బీసీ)కు 33 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 34 టీఎంసీలు, నెట్టెంపాడుకు 19.38 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 84.85 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 29 టీఎంసీల నికర జలాలను కేటాయించాలని కోరింది. వలసలకు నిలయమైన పాత మహబూబ్‌నగర్, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజల వెతలు ఈ ప్రాజెక్టుల ద్వారా తీరుతాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌పై ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగనున్నాయి.
Published Sun, Dec 23 2018 2:15 AM | Last Updated on Sun, Dec 23 2018 5:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment