మళ్లీ పంచాలి! | telangana demands redistribution of krishna water | Sakshi
Sakshi News home page

మళ్లీ పంచాలి!

Published Mon, Jun 30 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

telangana demands redistribution of krishna water

* కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ట్రం డిమాండ్
* బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించేందుకు సిద్ధం
* ఉమ్మడి రాష్ట్రంలో నీటికేటాయింపుల్లో అన్యాయం.. ఎగువ రాష్ట్రాలతోనూ సమస్య
* తెలంగాణలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉండగా.. నీటి కోటా 36.4 శాతమే ట్రిబ్యునల్ ఎదుట ఉమ్మడి
* ఆంధ్రప్రదేశ్ వాదనలు సమ్మతం కాదు
* మహారాష్ట్ర, కర్ణాటకతో సహా మళ్లీ విడిగా వాదనలు వినాలి..
* మొత్తం జలాలను నాలుగు రాష్ట్రాలకు మళ్లీ పంపిణీ చేయాలి
* మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని కోరనున్న టీ-సర్కారు
 
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాల మధ్య మళ్లీ పంపిణీ చేయాల్సిందేనని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేయనుంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని.. మళ్లీ వాదనలు వినాల్సిందేనని కోరనుంది.

అంతేగాకుండా కృష్ణా నీటిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను మాత్రమేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను కూడా కలుపుకొని మొత్తం నదీజలాలను తిరిగి పంచాలని విజ్ఞప్తి చేయనుంది. నదిలో నీటి లభ్యత శాతం, నీటి ప్రవాహం అంచనా కోసం పరిగణనలోకి తీసుకున్న 47 ఏళ్ల సమయం విషయంలో పలు అభ్యంతరాలను వెల్లడించనుంది. మొత్తంగా ప్రస్తుతమున్న దానికంటే ఎక్కువ నీటి కేటాయింపులు పొందాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వచ్చే నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ సమావేశాల్లో తన వాదన వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది.
 
ఎటూ తేలని పంపిణీ..
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి తొలుత బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. అయితే జలాలను పంపిణీ చేస్తూ ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రాల మధ్య వివాదాలు సద్దుమణగకపోవడంతో.. పదేళ్ల కింద బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కృష్ణా ట్రిబ్యునల్-2ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించింది. కానీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకంగా ఉండడంతో.. ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కూడా.

అయితే ఈ లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. దాంతో రెండు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యను పరిష్కరించడానికి వీలుగా అదే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగించారు. ఈ ట్రిబ్యునల్ తొలి సమావేశం వచ్చే నెల 24వ తేదీ నుంచి మొదలుకానుంది. ఈ ట్రిబ్యునల్ సమావేశంలో తమ వాదనలను వినిపించడానికి ఆయా రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి.
 
మొదటి నుంచీ పంచాలి..
వాస్తవానికి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు ఉద్దేశం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి మాత్రమే. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లులో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే వచ్చే నెలలో జరగనున్న ఈ ట్రిబ్యునల్ సమావేశాలకు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్ణాటకను కూడా ఆహ్వానించారు. దీంతో కృష్ణా జల వివాదం రెండు రాష్ట్రాల మధ్యనే కాకుండా నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాల్సి ఉంటుంది.

ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనల్ని వినిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని.. దానిని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సర్కారు వెల్లడించనుంది. ముఖ్యంగా నీటి పంపిణీని మళ్లీ మొదటి నుంచీ చేయాలని కోరనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వాదనలు తమకు సమ్మతం కాదని... వాటి ఆధారంగా చేసిన కేటాయింపులు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున వాటిని వ్యతిరేకించనుంది.
 
నాలుగు రాష్ట్రాల సమస్య
కృష్ణా నది జల వివాదాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశంగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరనుంది. తద్వారా ఎక్కువ నీటిని పొందవచ్చని అంచనా వేస్తోంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదంగా చూస్తే... ఆలమట్టి ఎత్తు, మిగులు జలాల పంపిణీ వంటి అంశాలను లేవనెత్తడానికి అవకాశం ఉండదు. కేవలం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

దాంతో నీటి కోటా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయా న్ని దృష్టిలో ఉంచుకుని.. కృష్ణా జలాల సమస్యను నాలుగు రాష్ట్రాలకు చెందినదిగా పరిగణించాలని తెలంగాణ సర్కా రు కోరనుంది. ప్రత్యేకించి నీటి కేటాయింపుల్లో నది పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉన్నప్పటికీ నీటి కేటాయింపు మాత్రం 36.4 శాతమే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ.. కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండాలని వాదించనుంది.
 
ఎగువ రాష్ట్రాలతో అన్యాయం
తెలంగాణ వాదనల సందర్భంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌తోనే పంచాయితీ ఉందని మాత్రమేగాకుండా... ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వల్ల కూడా అన్యాయం జరుగుతోందనే విషయాన్ని ట్రిబ్యునల్ మందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం పద్ధతి, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని కోల్పోవడం, నీటి ప్రవాహాన్ని లెక్కించడానికి కేవలం 47 ఏళ్ల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం.. తదితర అంశాల్లో ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు.

అలాగే నది నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడాన్ని కూడా వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కృష్ణా నీటిని ఇతర నదుల పరీవాహక ప్రాంతాలకు వినియోగించడానికి అనుమతించ వద్దని కోరనుంది. మిగులు జలాల పంపిణీని కూడా రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement