‘ఏపీ ఆడించినట్లే కృష్ణా బోర్డు ఆడుతోంది’ | harish rao complaint against andhra pradesh government | Sakshi
Sakshi News home page

‘ఏపీ ఆడించినట్లే కృష్ణా బోర్డు ఆడుతోంది’

Published Sat, Jun 4 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

‘ఏపీ ఆడించినట్లే కృష్ణా బోర్డు ఆడుతోంది’

‘ఏపీ ఆడించినట్లే కృష్ణా బోర్డు ఆడుతోంది’

హైదరాబాద్: కృష్ణా బేసిన్ సాగునీటి ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తీసుకునే విషయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ఆడించినట్లు ఆడుతోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌లను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల నియంత్రణ జోలికి వెళ్లరాదని ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, దాన్ని ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులను నోటిఫై చేయాలని కేంద్రానికి బోర్డు సిఫార్సు చేసిందని వారి దృష్టికి తెచ్చారు.

ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించి ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకోకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, గవర్నర్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. ప్రాజెక్టుల నియంత్రణ విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలను, చట్టంలో పేర్కొన్న అంశాలను, బచావత్, బ్రజేష్ ట్రిబ్యునల్ అవార్డులను వారికి వివరించారు. రాష్ట్ర పునర్‌విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వీటి నిర్వహనను మాత్రమే చూడాలని స్ష్పష్టంగా ఉందని తెలిపారు.

ప్రాజెక్టుల వారీగా ఎవరి వాటా ఎంత, వినియోగం ఏరీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు అర్థవంతంగా వ్యవహరించాలని, అయితే ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గిన బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు తొందర పడుతోందని వివరించారు. పునర్‌విభజన చట్టంలోని 87(1), 85(8) సబ్ సెక్షన్‌ల ప్రకారం కష్ణా బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని తెలిపారు. ఉమ్మడి ఏపీలో గత అరవై ఏళ్లుగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే అన్యాయం చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని దష్టికి తెచ్చారు. ఈ దష్ట్యా బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించ కుండా కేంద్ర పెద్దలతో మాట్లాడాలని, ఆ దిశగా వారిని ఒప్పించాలని మంత్రి హరీష్‌రావు వారిని కోరారు.

కాగా ఇదే విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరులశాఖా మంత్రి ఉమాభారతితో మంత్రి హరీష్‌రావు భేటీ సోమవారానికి వాయిదా పడింది. శని, ఆదివారాల్లో కేంద్ర మంత్రి ఢిల్లీలో అందుబాటులో లేకపోవటంతో సోమవారం రావాలని కేంద్రమంత్రి ఫోన్ చేసి కోరిన నేపథ్యంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. సోమవారం మంత్రితో పాటు పలువురు ఎంపీలు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు ఢిల్లీకి వెళ్లి బోర్డు అంశాన్ని వివరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement