
‘కృష్ణా’లో పూర్తి వాటా రాబట్టండి
• పోలవరం, పట్టిసీమలో మన వాటా అడగండి
• సాగునీటి అధికారులకు మంత్రి హరీశ్ దిశానిర్దేశం
• కర్ణాటక ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లో లభ్యతగా ఉన్న నీటిని పూర్తిగా రాబట్టేలా బోర్డు ముందు వాదనలు వినిపించాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించా రు. బుధవారం బోర్డు సమావేశం నేపథ్యంలో మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలు, ఇప్పటివరకు బేసిన్‌లో ఇరు రాష్ట్రాల నీటి వినియోగంపై ఇందులో చర్చించారు. లభ్యతగా ఉన్న నీటిని సాధించేలా కొట్లాడాలని, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేసిన అధిక వినియోగాన్ని బోర్డు దృష్టికి తేవాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ కింద నీటి వినియోగంపై గట్టిగా చెప్పాలని, మరింత వాటా కోసం పట్టుబట్టాలని ఆదేశించారు.
వాటి కోసం కొట్లాడండి...
ఈ నెల 12 నుంచి రాష్ట్ర పర్యటనకు రానున్న ఏకే బజాజ్ కమిటీ ముందుంచాల్సిన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పైరాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల కేటాయింపుల్లో 21 టీఎంసీలు కర్ణాటక, 13 టీఎంసీలు మహారాష్ట్ర వినియోగించుకునేందుకు ఎత్తిపోతల పథకాలు చేపట్టిన అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మిగతా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రంగా ఈ నీటి వాటా హక్కు తెలంగాణదేనని కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా అడగాలని ఆదేశించారు.
ఈ లెక్కన మొత్తంగా తెలంగాణ నీటి వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలని సూచించినట్లు తెలిసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటాకు సంబంధించిన ప్రాజెక్టుల ’ఆపరేషన్ ప్రోటోకాల్’ ను అధ్యయనం చేసే కమిటీ ముందు సమర్థంగా వాదనలు విన్పించాలన్నారు. ఈ మేరకు తగిన హోంవర్క్ చేసి ప్రజెంటేషన్ రూపొందించాలని ఆదేశించారు. రెండ్రోజుల్లో ఈ ప్రజెంటేషన్ను తనకు చూపాలని కోరారు.
ఆల్మట్టి–నారాయణపూర్ ప్రాజెక్టుల మధ్య కృష్ణాపై కర్ణాటక తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు, లిఫ్టులపై సంక్షిప్త నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, అంతర్రాష్ట్ర విభాగపు అధికారులు పాల్గొన్నారు.
కృష్ణాపై నేడే బోర్డు భేటీ
కృష్ణా జలాల వినియోగంపై బోర్డు బుధవారం పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హెచ్‌కే హల్దార్ నేతృత్వంలో జరిగే తొలి భేటీ ఇదే. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు, బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలన్నీ మాకంటే మాకేనని ఇరు రాష్ట్రాలు పట్టుబడుతున్న నేపథ్యంలో బోర్డు ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. టెలీమెట్రీతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద ఇరు రాష్ట్రాల నీటి వినియోగం తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.