సాగర్‌కు ఇక తుపాన్‌లే దిక్కు | lack of water in nagarjunasagar | Sakshi
Sakshi News home page

సాగర్‌కు ఇక తుపాన్‌లే దిక్కు

Published Mon, Oct 24 2016 3:22 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

lack of water in nagarjunasagar

నైరుతి ముగియడంతో ఎగువ నుంచి నీటి రాక ఆశలు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్ల అనంతరం విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టున్నీ జలకళను సంతరించుకుంటే నాగార్జునసాగర్ మాత్రం నీటి లోటుతో అల్లల్లాడుతోంది. ఏకంగా 121.2 టీఎంసీల లోటును ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాల కాలపరిమితి ముగియడంతో ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవాహాలు వస్తాయన్న ఆశలూ అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో నవంబర్‌లో వచ్చే తుపాన్‌లనే నమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నవంబర్‌లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్‌ల ప్రభావం కృష్ణా బేసిన్‌పై ఎక్కువగా ఉంటుందని, అవి వస్తేనే ప్రాజెక్టుల్లోకి ఆశించిన నీరు వస్తుందని, లేదంటే మున్ముందు నీటి కష్టాలు తప్పవని నీటిపారుదల వర్గాలంటున్నాయి.

ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌కు ఇప్పటివరకు 420 టీఎంసీల వరకు వరద జలాలు వచ్చా రుు. కానీ దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు మాత్రం కేవలం 102 టీఎంసీలు మాత్రమే వరద చేరింది. దీంతో ప్రస్తుతం సాగర్‌లో 312.04 టీఎంసీల నీటి నిల్వకుగాను కేవలం 190.84 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. 121.1 టీఎంసీల లోటు ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి భారీగానే నీరు చేరినా ఆ నీటిని ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులు వాడేసుకోవడంతో సాగర్‌కు పెద్దగా ప్రవాహాలు రాలేదు. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలోనూ 215.80 టీఎంసీల నీటి నిల్వకుగాను 189.45 టీఎంసీ నిల్వ మాత్రమే ఉంది. దీంతో మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 147.55 టీఎంసీల లోటు కనబడుతోంది. గడ్డు పరిస్థితి ఎదురైన గత ఏడాదిలోనూ తుంగభద్ర నుంచి రాష్ట్ర ప్రాజెక్టులకు 73 టీఎంసీల మేర నీరు వచ్చి సాగర్‌ను ఆదుకుంది.

 కానీ ఈ ఏడాది తుంగభద్రలోకి నీళ్లే రాలేదు. దీంతో ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 100 టీఎంసీల నిల్వకు గానూ కేవలం 30.37 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. ఇక్కడి లోటు ప్రభావం సాగర్ జలాశయంపై పడింది. ఈ నేపథ్యంలో నవంబర్ మొదట్లో బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్‌లనే రాష్ట్రం నమ్ముకోవాల్సి ఉంటుంది. వీటి ప్రభావం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై అధికంగా ఉంటుంది. గతంలో తుఫాన్‌ల సమయంలో వచ్చిన నీటితోనే సాగర్ జలాశయంలోకి నీరు చేరి జంటనగరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement